ట్రాఫిక్ తో బెంగళూరు సిటీ నష్టం తేలింది.. హైదరాబాద్ మాటేంటి?

తీవ్రమైన ట్రాఫిక్ సమస్య కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్ల మేర బెంగళూరు మహానగరి నష్టపోతున్నట్లుగా లెక్క తేల్చారు

Update: 2023-08-08 05:04 GMT

మహానగరాల్ని వేధించే సమస్యల్లో ప్రధానమైనది.. నిత్యం నగర జీవులు ఎదుర్కొనే సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది ట్రాఫిక్. దీనితో కోట్లాది పని గంటలు వేస్టు కావటమే కాదు.. వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్న మాట ఉన్నప్పటికీ.. దానిపై అధ్యయనం చేసింది లేదు.

తాజాగా ఆ కొరతను తీరుస్తూ.. ట్రాఫిక్ సమస్య కారణంగా జరిగే నష్టం ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా లెక్కలు బయటకు వచ్చాయి. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ట్రాఫిక్ కారణంగా బెంగళూరు మహానగరి నష్టపోతున్నదెంత? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానం షాకింగ్ గా మారింది. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్ల మేర బెంగళూరు మహానగరి నష్టపోతున్నట్లుగా లెక్క తేల్చారు. ఏళ్లకు ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యతో గార్డెన్ నగరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. సొల్యూషన్ మాత్రం లభించని పరిస్థితి. ట్రాఫిక్ జామ్ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలిచే ఐటీ రంగమేనని తేల్చారు.

ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్ తోనే గడుపుతున్నట్లుగా గుర్తించారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఒక్క ఐటీ రంగానికే రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తేల్చారు. నగర ప్రజలు సైతం నాణ్యమైన జీవనాన్ని పొందలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు.

ప్రజా రవాణ వ్యవస్థను మెరుగుపర్చటం.. కార్ పూలింగ్ లాంటి వాటితో పాటు.. కెమేరాలు.. సెన్సార్ వ్యవస్థల్ని నెలకొల్పి.. ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించటం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు.

బెంగళూరు నగరం మాదిరే తీవ్రమైన ట్రాపిక్ సమస్యను ఎదుర్కొనే హైదరాబాద్ కు జరుగుతున్న డ్యామేజ్ ఎంతన్న విషయంపై అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది.మరి.. మంత్రి కేటీఆర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పక తప్పదు.

Tags:    

Similar News