సంపద పన్ను షాక్ కు జీ20 దేశాల ప్రజల మాట ఇదేనట!
ఈ సమావేశంలో అపర సంపన్నుల ఆదాయంపై విధించే సంపద పన్ను అంశంపై ఒక క్లారిటీ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు సాదాసీదా జీవి కొనే ప్రతి వస్తువు మీదా పన్ను చెల్లించకుండా ఉండలేని పరిస్థితి. వస్తువులే కాదు వస్తు సేవలకు సైతం పన్ను పోటు తప్పదు. అలాంటిది అపర సంపన్నుల మీద సంపద పన్ను వేస్తే ఎలా ఉంటుంది. డబ్బులున్నోడి దగ్గరకే డబ్బులు అదే పనిగా వస్తున్న వేళ.. వారిపై ప్రత్యేకంగా సంపద పన్ను వేస్తే? అన్న ఆలోచనపై వచ్చే నెలలో జీ20 దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు ప్రత్యేకంగా భేటీ కావటమే కాదు.. ఈ అంశంపై చర్చించే వీలుందని చెబుతున్నారు.
ఈ సమావేశంలో అపర సంపన్నుల ఆదాయంపై విధించే సంపద పన్ను అంశంపై ఒక క్లారిటీ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇదే జీ20 దేశాలకు చెందిన ప్రజలు ఈ సంపద పన్నుపై ఎలా రియాక్టు అవుతున్నారు? వారికి ఈ స్పెషల్ పన్నుకు సానుకూలంగా ఉన్నారా? అన్న సందేహానికి సమాధానం వెతికే ప్రయత్నం చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే జీ20 సభ్య దేశాల్లోని 68 శాతం మంది సంపద పన్ను ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
మరి.. మన దేశంలో దీనిపై ఎంతమంది సానుకూలంగా ఉన్నారన్న విషయానికి వస్తే.. ఏకంగా 74 శాతం మంది దీనికి పాజిటివ్ గా రియాక్టు అయ్యారు. ఈ ఆసక్తికర సర్వేను ఎర్త్ 4ఆల్.. గ్లోబల్ కామన్స్ అలయన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించారు. అత్యంత సంపన్నులపై స్పెషల్ గా పన్ను వసూలు ప్రతిపాదన 2013 నుంచి ఉన్నప్పటికీ అది చర్చ దశ దాటి ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం జీ20 దేశాలకు బ్రెజిల్ అధ్యక్షత వహిస్తోంది.
ఈ కూటమి సంపద పన్నుపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సర్వేలో భారతీయులు చాలామంది వాతావరణ మార్పులు.. ప్రక్రతి సంరక్షణకు సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని.. సంపన్నులపై విధించే పన్ను ఆదాయాన్ని వీటి కోసం ఖర్చు చేయాలని కోరుతున్నారు. అత్యంత సంపన్నులపై సంపద పన్నును విధించాలన్న సిద్ధాంతానికి కీలకమైన ఫ్రెంచ్ ఆర్థిక వేత్త గాబ్రియేల్ జుక్మాన్ వాదన ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది.
సాధారణ ప్రజలతో పోలిస్తే సంపన్నులు చాలా తక్కువ పన్ను చెల్లిస్తారని.. సంపద పన్నును విధించటం ద్వారా అంతర్జాతీయంగా ఒక ప్రమాణం ఏర్పడుతుందని ఆయన చెబుతుంటారు. ప్రతి దేశంలో బిలీయనీర్లు తమ సంపదలో కనీసం రెండు శాతాన్ని వార్షికంగా పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆకలి.. ఆర్థిక అసమానతలు.. వాతావరణ మార్పుల సమస్యల పరిష్కారానికి సంపద పన్ను సరైనదిగా ఆయన చెబుతుంటారు.
ఈ సంపద పన్ను ద్వారా వచ్చే మొత్తాల్ని ఏయే అంశాలకు ఖర్చు చేయాలన్న దానిపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై సర్వేలో పాల్గొన్న భారతీయులు ఏం చెప్పారన్నది చూస్తే.. మెరుగైన వర్కులైఫ్ బ్యాలెన్సు కోసం ఈ పన్ను ఆదాయాన్ని ఉపయోగించాలని కొందరు.. విద్యుదుత్పత్తి.. రవాణా.. నిర్మాణం.. పరిశ్రమలు.. ఫుడ్ తదితర రంగాల్లో మార్పులు చేసేలా ఈ పన్ను ఆదాయాన్ని ఖర్చు చేయాలని 68 శాతానికి పైగా భారతీయులు కోరుకుంటున్నట్లుగా సర్వే నివేదిక వెల్లడించింది.