నస్రుల్లాను ఇజ్రాయెల్ కు పట్టించింది ఇరానే...?
కాగా, ఇప్పుడు హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లా కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ తెలియజేసింది కూడా ఇరాన్ గూఢచారేనట..?
30 ఏళ్లుగా హెజ్బొల్లా బాధ్యతలను చూస్తూ.. భయంకర దాడులకు ప్లాన్లు వేస్తూ.. ఎప్పడూ బంకర్ లలో ఉండడం తప్ప బయటకు రాని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను ఈసారి మాత్రం ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది..? ఇన్నాళ్లూ కనిపెట్టలేకపోయిన అతడి జాడను ఇప్పుడెలా పసిగట్టింది..? లక్షన్నర రాకెట్ల సామర్థ్యం.. అణు బాంబులున్న ఇరాన్ కు పెంపుడు బిడ్డ అయిన హెజ్బొల్లా సంస్థకు చీఫ్ అయిన నస్రుల్లా ఆట కట్టించింది ఎవరు? దీనికి సమాధానం లభించింది.
అప్పుడూ ఇప్పుడూ వెన్నుపోటుతోనే..
రెండు నెలల కిందట హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా కథ గుర్తుంది కదా.. అతడు ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చి ఓ రహస్య ప్రదేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసి చంపేసింది. అయితే, నాడు హనియా ఉనికిని తెలియజేసింది ఇరాన్ కు చెందిన భద్రతా సిబ్బందేనని బయటపడింది. కాగా, ఇప్పుడు హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లా కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ తెలియజేసింది కూడా ఇరాన్ గూఢచారేనట..?
బంకర్ సమాచారం అందజేసి..
ఫ్రాన్స్ కు చెందిన పత్రిక ల పర్షియన్ కథనం ప్రకారం.. నస్సుల్లా బీరుట్ శివార్లలోని దహియాలో అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నట్లు, టాప్ కమాండర్లతో భేటీ అవుతున్నట్లు ఇరాన్ గూఢచారి నుంచి ఇజ్రాయెల్ కు ఉప్పందింది. దానిని పక్కా చేసుకున్న ఇజ్రాయెల్.. నేరుగా దాడి చేసి మొత్తం భవనాలను పేల్చేసింది. వాస్తవానికి 2006లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ కు హెజ్బొల్లా నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. అప్పడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపినా.. హెజ్బొల్లా ఆయుధాలను భారీగా పెంచుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసుకుంది. దీనికి చెందినదే 8200 సిగ్నల్ ఇంటెలిజెన్స్. 2008లో మొస్సాద్ తొలుత హెజ్‌బొల్లా టాప్ ఆపరేటివ్ ఇమాద్ ముగ్నియాహ్ ను సిరియాలో చంపేసింది. 2020లో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్.. ఇరానీ కమాండర్ ఖాసిం సులేమానీ ఎక్కడున్నదీ పసిగట్టి అమెరికా దళాలకు చేరవేసింది. గత జూలైలో హెజ్‌బొల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్రు ను, తాజాగా రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ నూ హతమార్చింది. ఇప్పుడు నస్రుల్లానూ చంపేసి.. హెజ్‌బొల్లా కమాండ్ వ్యవస్థను కూల్చేసింది. కాగా, హెజ్బొల్లా ను ఇరాన్ అన్నివిధాలా పెంచి పోషించింది. అంటే.. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ వేలితోనే హెజ్బొల్లా కంట్లో పొడిచిందన్నమాట.