బెయిల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు.. చంద్రబాబుకు స్వల్ప ఊరట!

ఇదే సమయంలో... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.

Update: 2023-10-11 10:26 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ లీగల్ బ్యాటిల్ లో ఇప్పటివరకూ ఒక్క అనుకూల అంశం కూడా జరగలేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. బెయిల్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లు... ఇలా వేటిలోనూ ఇప్పటివరకూ బాబుకు ఉపశమనం కలగలేదు. ఈ క్రమంలో తాజాగా బాబుకు హైకోర్టులో ఉపశమనం కలిగింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణలు రసవత్తరంగా సాగుతున్న ఈ తరుణంలో... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్, అంగళ్లు అల్లర్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఇందులో భాగంగా... అంగళ్లు అల్లర్ల కేసులో ఈ నెల 12వ తేదీ (గురువారం) వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

ఇదే సమయంలో... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై అప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది!

కాగా... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌.. న్యాయస్థానాన్ని కోరారు. ఇదే సమయంలో కేసుల్లో విచారణకు అన్నివిదాలా సహకరిస్తామని తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది.

దీనికి సమాధానంగా... ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పెండింగ్‌ లో ఉందని ఏజీ శ్రీరాం తెలిపారు.. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దన్న ఆదేశించింది.

Tags:    

Similar News