చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. రికార్డు స్థాయిలో 'వ్యూస్'
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు ప్రమా ణ స్వీకారం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు ప్రమా ణ స్వీకారం చేశారు. చంద్రబాబు తన జీవిత కాలంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు లక్షల సంఖ్యలో వచ్చారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం వచ్చి ఇక్కడ ఆశీనులైందా? అన్నట్టుగా కేంద్రంలోని ప్రధాన నాయకులు కూడా తరలి వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ సారథి నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ సహా అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక, సినీ రంగం నుంచి మెగా స్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ వంటి అతిరథ నాయకులు కూడా హాజరయ్యారు. దీంతో చంద్రబాబు సహా కూటమి పార్టీల నేతల ప్రమాణ స్వీకారానికి ఎక్కడాలేని హంగు ఏర్పడింది. ఇక, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారే లక్షకుపైగా ఉన్నారు.
ఇక, ఇళ్లలోనూ.. ప్రయాణాల్లోనూ వీక్షించిన వారు లక్షలకు పైగానే ఉన్నారు. ముఖ్యంగా లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో ప్రజలు వీక్షించారు. దాదాపు అన్ని టీవీ చానెళ్లు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ముఖ్యంగా చంద్రబాబు.. ``నారా చంద్రబాబు నాయుడు అనే నేను`` అని ప్రమాణం చేస్తున్నప్పుడు.. భారీ ఎత్తున ఆయనను ప్రశంసిస్తూ.. స్లోగన్లు వచ్చాయి. ఇక, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారు కూడా సంబరంలో మునిగిపోయారు.
ఇదేసమయంలో యూట్యూబ్ ఒక్కదానిలో 2.5 లక్షల మంది వీక్షించారు. ఇది..తెలుగు కార్యక్రమాన్ని వీక్షించిన వారి సంఖ్యలో రికార్డు స్థాయి కావడం గమనార్హం. ప్రమాణ స్వీకారం అనంతరం.. ప్రధాని మోడీ చంద్రబాబును ఆలింగనం చేసుకుని భుజం తట్టిన తీరు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేవిధంగా జనసేన అధినేతపవన్ కల్యాణ్ ప్రమాణం చేసిన సమయంలోనూ.. పెద్ద ఎత్తున వీక్షకుల నుంచి స్పందన వచ్చింది.