బాబును టెన్షన్ పెడుతున్న ఆయన జోస్యం...!

ఆనాడు బాబు తప్పకుండా తాము అధికారంలోకి మళ్లీ వస్తామని కూడా చెప్పుకున్నారు.

Update: 2024-01-30 11:32 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు సంక్షోభాల నుంచి కూడా సవాల్ గా తీసుకుని అభివృద్ధికి సోఫానాలు వేసుకుంటారు. ఆయన అదే విషయం పదే పదే చెబుతూ ఉంటారు. అయితే 2019 ఎన్నికల తరువాత నాడు వచ్చిన దారుణమైన ఫలితాల తరువాత బాబుకు కొంత ధీమా సడలింది అని అంటారు. ఆనాడు బాబు తప్పకుండా తాము అధికారంలోకి మళ్లీ వస్తామని కూడా చెప్పుకున్నారు.

కానీ తీరా ఫలితాలు చూస్తే మాత్రం కేవలం 23 సీట్లు వచ్చాయి. అలాగే మూడంటే మూడు ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక గత ఏణ్ణర్ధం వరకూ పార్టీ అయితే పెద్దగా లేచి కూర్చున్న దాఖలాలు లేవు. ఇపుడు జనసేనతో పొత్తు ఉన్నా ఎన్నికల గోదావరిని ఈది ఫలితం దక్కేంతవరకూ టెన్షన్ అయితే నిండా ఉంది.

పాత ప్రయోగాలు, ఎన్నికల ఎత్తులు అన్నీ కూడా ఊహించిన ఫలితాలు ఇస్తాయా అన్న డౌట్లూ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలి. అది ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలో నిన్నటిదాకా సొంత పార్టీలో ఉండి ఈ రోజు వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని బాబుకు ప్రతీ రోజూ చెబుతున్న చేదు జోస్యం ఏ మాత్రం మింగుడు పడినట్లుగా లేదు అంటున్నారు.

ఆయన టీడీపీ ఓటమి గురించి చెబుతూనే టీడీపీకి బాబుకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మరో దారుణమైన ఫలితాన్ని కళ్ళ ముందుంచుతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. టీడీపీ ఈసారి సర్వ శక్తులూ కూర్చుకుంకి గట్టి ఫైట్ ఇచ్చేలా ఉంది. కానీ ఒకవేళ ఓడితే ఇవే చివరి ఎన్నికలు అంటూ కేశినేని నాని చెప్పడమే బాబుతో పాటు టీడీపీని కంగారు పెడుతున్న విషయం.

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అవుతుందని చంద్రబాబు ఏ మీదట హైదరాబాద్ కి వెళ్ళిపోతారని కేశినేని చెబుతున్న మాటలు టీడీపీని తమ్ముళ్లను ఇబ్బందిలో పెడుతున్నాయి. అంతే కాదు వారిలో ఎన్నడూ లేని కలవాన్ని కూడా కలిగిస్తున్నాయి అంటున్నారు. చంద్రబాబు ఈసారి ఆరు నూరు అయినా గెలవలేరు అంటూ సర్వేలను జ్యోతీష్య పండితులను మించి మరీ కేశినేని చెబుతున్న జోస్యం టీడీపీ చెవిలో సీసం కరగించి పోసినట్లుగా ఉంటోంది అంటున్నారు.

శుభామాని ఎన్నికలకు వెళ్తూ ఇలాంటి అపశకునం మాటలు వినడమేంటి అన్నదే ఆ పార్టీకి పట్టుకుంది. టీడీపీలో నిన్నటిదాకా ఉండి వచ్చిన కేశినేని నానికి ఆ పార్టీ పట్లూ గుట్లూ గోత్రాలు అన్నీ తెలుసు. ఆయన మాటలకు ఆ విధంగా ఒక క్రెడిబిలిటీ అయితే జనాల్లో ఉండే చాన్స్ ఉంది. ఇదే ఇపుడు టీడీపీని ఇంకా ఇబ్బంది పెడుతున్న విషయం అని అంటున్నారు.

అయితే కేశిఎనని నానిని ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన ఎంచక్కా వైసీపీలో చేరిపోయి తనకు తన అనుచరుడికి కూడా టికెట్ తెచ్చుకున్నారు. ఇక నానిని ఓడించే క్యాండిడేట్ దొరకక టీడీపీ ఇబ్బందులో ఉంది. ఇది చాలదు అన్నట్లుగా నాని విమర్శల పర్వం కొనసాగుతోది. అలాగే ఆయన చంద్రబాబుని లోకేష్ ని కలిపి మరీ వేసుకుంటున్నారు.

లోకేష్ ని పట్టుకుని ఎందుకు పనికిరానివారు అనేస్తున్నరు. కమిషన్ల కోసమే చింతలపూడి ఎత్తిపోతల పధకానికి చంద్రబాబు అప్పట్లో శంకుస్థాపన చేశారు అని తీవ్ర ఆరోపణలను ఆయన తాజాగా చేశారు. మొతానికి నాని చెబుతున్న మాటలు చేస్తున్న విమర్శలు చెప్పులో రాయి చెవిలో జోరిగ మాదిరిగా టీడీపీని తెగ పరేషాన్ చేస్తున్నాయట. చివరి ఎన్నికలు అన్న పదం మాత్రం కేశినేని నాని నుంచి వస్తూంటే టీడీపీలో ప్రకంపనలే పుడుతున్నాయట. చూడాలి మరి కేశినేని నాని జోస్యం పవర్ ఎంత అన్నది.


Tags:    

Similar News