తెలంగాణలో హుక్కా సెంటర్లు బ్యాన్.. ఏకగ్రీవంగా ఆమోదం

ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు

Update: 2024-02-12 13:36 GMT

తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా ప్రవేశ పెట్టిన బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండా యావత్ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం పలికింది. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగా హుక్కా సెంటర్లను నిషేధం విధించినట్లు అవుతుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం మంత్రి శ్రీధర్ బాబు ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. హుక్కా సెంటర్ల నిషేధానికి సంబంధించి.. ''సిగిరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్ మెంట్ బిల్లు''ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున సభలో ప్రవేశ పెట్టారు. దీనిపై ఎలాంటి చర్చా జరగలేదు.

ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ బిల్లు తాజాగా సభ ఆమోదం పొందటంతో.. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా బ్యాన్ అమల్లోకి రానుంది. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

సిగిరెట్ కంటే హుక్కా మరింత ప్రమాదకరమని.. దీన్ని సేవించే వారే కాదు.. వారి పక్కన ఉన్న వారి ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుందన్నారు. బొగ్గును ఉపయోగించటం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదల అవుతుందని.. దీన్ని సేవించే వారితో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వారంతా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. హుక్కాసెంటర్లపై బ్యాన్ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ భావించారని.. అందుకే ఈ బిల్లును ప్రవేశ పెట్టినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు కారణంగా పబ్బులతో పాటు పలు హుక్కా కేంద్రాలు.. కాఫీ షాపులు.. ఇతర ప్రాంతాల్లో ఉండే హుక్కా సెంటర్లు బంద్ కానున్నాయి.

Tags:    

Similar News