ఆస్పత్రులను ఖాళీచేయమంటున్న ఐడీఎఫ్... ఈజిప్ట్ గుడ్ న్యూస్!
అవును... గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గాజా స్ట్రిప్ లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిని దిగ్బంధించిన ఇజ్రాయేల్ సైన్యం... ఆ ఆస్పత్రిలో రోజుల తరబడి తనిఖీలు చేస్తూ.. హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హమాస్ తమ ప్రధాన కమాండ్ సెంటర్ గా ఆస్పత్రులను వాడుకుంటోందని చెబుతూ అందుకు బలమైన సాక్ష్యాలను బయటపెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఆస్పత్రిని టార్గెట్ చేసింది.
అవును... గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడి తర్వాత ఆ దేశం నుంచి కిడ్నాప్ చేసిన కొంతమందిని ఈ ఆస్పత్రిలో బందించేందుకు తీసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కన్పించింది. దీంతో ఆస్పత్రులనే హమాస్ స్థావరాలుగా చేసుకుందని ఇజ్రాయేల్ సైన్యం బలంగా నమ్ముతున్నట్లుంది.
దీంతో... ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ హాస్పిటల్ ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఆస్పత్రి రెండో అంతస్తుపై ఐడీఎఫ్ శతఘ్నలతో దాడి చేసింది. దీంతో... ఆసుపత్రి పరిసరాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ దాడిలో ఇప్పటివరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో... రోగులతోపాటూ ఆస్పత్రిని ఖాళీ చేయండి.. లేదా, వారిని వదిలేసైనా వెళ్లిపోండి అంటూ వైద్య సిబ్బందికి ఐడీఎఫ్ హెచ్చరికలు పంపింది.
కాగా... అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించిన సంగతి తెలిసిందే. వారిలో చాలామందిని అల్–షిఫా ఆస్పత్రి కింది భాగంలోని సొరంగాల్లో దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తాజాగా ఈ ఆరోపణలకు బలంచేకూర్చేలా సాక్ష్యాధారలను బయటపెట్టింది. అక్టోబర్ 7న నిఘా కెమెరా చిత్రీకరించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బహిర్గతం చేసింది.
ఇలా అక్టోబరు 7న సరిహద్దు ఇజ్రాయెల్ ప్రాంతాలపై దాడి చేసి అపహరించిన బందీలను కూడా హమాస్ మిలిటెంట్లు.. ఈ వైద్యశాలల పరిసరాల్లోనే దాచి ఉంచారని ఐడీఎఫ్ తన అనుమానాన్ని కన్ ఫాం చేసుకుంది. పైగా ఆల్-షిఫా ఆసుపత్రిపై దాడి సందర్భంగా ఇద్దరు బందీల మృతదేహాలు దొరకడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపిస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రులే లక్ష్యంగా దాడులు షురూ చేసింది!
ఆ సంగతి అలా ఉంటే... అల్–షిఫా నుంచి దక్షిణ గాజాలోని అల్–అహ్లీ ఎమిరేట్స్ హాస్పిటల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందిని ఈజిప్టుకు చేర్చారు. వారికోసం ఈజిప్టు వైద్యులు ఇంక్యుబేటర్లు సిద్ధంగా ఉంచారు. ఈజిప్టులో వారికి మెరుగైన చికిత్స అందించనున్నారు. వీరంతా అల్–షిఫాలో నెలలు నిండక ముందు జన్మించి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారే!