మోడీ సర్కార్ మీద ఎంత మాట అనేశారో ఓవైసీ...!

దీని వల్ల ఇతర సెక్యులర్ పార్టీలకు ఇబ్బంది కలిగినా తామే ముస్లిం సమాజానికి అసలు సిసలు చాంపియన్ అని మజ్లిస్ చెప్పుకోవడానికి తెగ ఉబలాటపడుతోంది అన్నది యధార్ధం.

Update: 2024-02-03 03:53 GMT

దేశంలో ముస్లింలకు ఎన్నో సంస్థలు ఉన్నాయి. రాజకీయంగా చూస్తే ముస్లిం లీగ్ వంటి పార్టీలు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం వహించేందుకు చాలా కాలంగా మజ్లీస్ పార్టీ తపన తాపత్రయం పడుతూ వస్తోంది. దేశంలో ఏ సంఘటన జరిగినా ఖండిస్తూ మజ్లిస్ ముందుంటోంది. ముస్లిం లకు తామే అసలైన రక్షకులం అన్నట్లుగా మజ్లీస్ హైలెట్ చేసుకుంటోంది.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మజ్లీస్ పోటీ చేస్తోంది. దీని వల్ల ఇతర సెక్యులర్ పార్టీలకు ఇబ్బంది కలిగినా తామే ముస్లిం సమాజానికి అసలు సిసలు చాంపియన్ అని మజ్లిస్ చెప్పుకోవడానికి తెగ ఉబలాటపడుతోంది అన్నది యధార్ధం. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మజ్లీస్ కి ఉన్నది ఏకైక ఎంపీ సీటు మాత్రమే.

అలా మజ్లీస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీని ఒవైసీ మొత్తం పార్లమెంట్ లో మంచి మెజారిటీతో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ఎప్పటికపుడు విమర్శించేందుకు వెనకాడడంలేదు. ఆయన మోడీ ఏది చేసినా అది ముస్లిం సమాజానికి వ్యతిరేకం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సరే రాజకీయ విమర్శలు కూడా ఇందులో ఉంటాయని అనుకున్నా ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద మాటనే ఓవైసీ వాడేశారు.

అదేంటి అంటే హిట్లర్ తో మోడీకి పోలిక పెట్టేశారు. ఆయన పాలనలో యూదులు ఎలాంటి పరిస్థితులు అనుభవించారో అలాంటి భావనతోనే దేశంలోని ముస్లింలు ఉన్నారని ఒవైసీ అనడం విశేషం. గడచిన పదేళ్లలో మోడీ పాలనలో దేశంలో ఒక మతం, ఒక వ్యక్తి, ఒక పార్టీ ఒక భావజాలం మాత్రం బలపడ్డాయని ఒవైసీ విశ్లేషించారు.

అంటే మోడీ, హిందూత్వ భావజాలం , హిందూత్వ దృక్కోణం బలపడ్డాయని ఒవైసీ అంటున్నారు అన్న మాట. అదే సమయంలో మరొకరి గుర్తింపును చెరిపేసే ప్రయత్నం గట్టిగా జరిగిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచింది అని ఒవైసీ అంటున్నారు. ఈ మాటలు ఆయన ఎక్కడో అనలేదు, పార్లమెంట్ సమావేశాల్లోనే అంటున్నారు.

మోడీ పాలనలో తప్పుల గురించి ఆయన అనడంలో వింత లేదు కానీ యూదుల బాధలు దేశంలో ఒక వర్గం అనుభవిస్తున్నారు అంటే ముస్లిం సమాజానికి ఏదో అన్యాయం జరిగిపోతోంది అని ఒవైసీ ప్రపంచానికి చాటదలచారా అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే ఒవైసీకి అర్ధం కానిది ఏంటి అంటే ట్రిపుల్ తలాక్ అన్న దాన్ని ముస్లిం సమాజంలోకి మహిళాలోకమే హర్షించి స్వాగతించిందని అంటున్నారు.

అలాగే అయోధ్య రామ మందిరం ప్రారంభం విషయంలో రెండవ వర్గం కూడా సహకరించిందని గుర్తు చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో రాముడి గుడి పక్కన ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సాయంగా ముందుకు వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాగే దేశంలో అన్ని వర్గాల సమానత్వం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాశ్మీరు భారత్ లో భాగమని, దాన్ని అంతర్భాగం చేయడం ఒక వర్గానికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే లౌకిక వాదం అన్న బ్రహ్మ పదార్ధంతో దేశంలోని వివిధ మతాల మధ్య అంతరం రేపడం గతంలో జరిగితే ఇపుడు ఆ తప్పులు సరిదిద్దే కార్యక్రమం జరుగుతుంది అంటున్న వారూ ఉన్నారు. దేశ అభివృద్ధిలో లభించే ఫలాలు ముస్లిం సమాజం సహా అన్ని వర్గాలు అందుకుంటున్న వేళ ఒవైసీ వంటి వారు ఇలా విభజించే మాటలు మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్ అని బీజేపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.


Tags:    

Similar News