మొత్తానికి వాకింగ్‌ ఎలా చేయాలో జెన్‌ జడ్‌ కనుగొన్నారు

అవును... జెన్‌ జడ్‌ అనే బ్యాచ్ ఆ మధ్యకాలంలో "క్వైట్‌ క్విట్టింగ్‌" అంటూ ఒక దాన్ని ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-17 17:30 GMT

ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అన్నట్లుగా సాగిపోతుంటుంది ఈ ట్రెండింగ్ వ్యవహారం. ఇలా ఒకదానితర్వాత ఒకటి ఒక్కోసారి ట్రెండ్ అవుతూ, నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో జనరేషన్ జడ్ (జెన్ జడ్) వ్యక్తులు ఇటీవల వైరల్ చేస్తున్న కొన్ని ట్రెండ్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది వెటకారమాడుతున్నారు.

అవును... జెన్‌ జడ్‌ అనే బ్యాచ్ ఆ మధ్యకాలంలో "క్వైట్‌ క్విట్టింగ్‌" అంటూ ఒక దాన్ని ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. వృత్తి జీవితంలో తన పని వరకు మాత్రమే పరిమితం కావడం అనేది దీని ఉద్దేశ్యం. ఆఫీసుకి వెళ్లామా, మనపని మనం చేశామా, వచ్చేశామా అనేది దీని క్లారిటి! ఇదే సమయంలో "బేర్‌ మినిమం మండేస్‌" అనే మరో కొత్త ట్రెండ్‌ ను తెరపైకి తెచ్చారు. ఇది కూడా ఉద్యోగులకు ఫేవర్ గా ఉండే విషయం.

వీకెండ్స్ లో రెస్ట్ తర్వాత ప్రెజర్ ఫీల్ అవ్వకుండా... సోమవారాలు పెద్దగా పని భారం పెట్టుకోకుండా ఉండేందుకు అన్నట్లుగా ఈ "బేర్‌ మినిమం మండేస్‌" అనే కొత్త ట్రెండ్‌ ను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో తాజాగా మరో లేటెస్ట్‌ ట్రెండ్‌ "సైలెంట్‌ వాకింగ్‌"ను తెరపైకి తెచ్చారు. ఇది ఎలా స్టార్ట్ అయ్యింది.. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.!

ఇటీవల అమెరికాకు చెందిన మ్యాడీ మే అనే పాడ్‌ కాస్టర్‌ టిక్ టాక్ లో చేసిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో మ్యాడీ... సైలంట్ వాకింగ్ ప్రస్థావన తీసుకొచ్చారు. ఇందులో భాగంగా... తన జీవిత భాగస్వామి సూచించడంతో టెక్నాలజీకి దూరంగా ఉంటూ వాకింగ్ మొదలుపెట్టినట్లు చెప్పాడు. ఇది ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇలా వాకింగ్‌ వెళ్లేటప్పుడు ఎయిర్ పాడ్స్‌, పాడ్‌ కాస్ట్‌ లు, మ్యూజిక్‌ వంటి వాటికి దూరంగా ఉండడం మొదలు పెట్టానని.. మొదట్లో ఇలా చేయడానికి కాస్త కష్టంగా అనిపించినా.. క్రమంగా అలవాటైందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వడంతోపాటు అందులోని "సైలంట్ వాకింగ్" అనే ఇష్యూ ట్రెండ్ అవ్వడం మొదలైంది.

ఇంకా... విశ్వం, మీ గుండెలోతుల్లోంచి కొన్ని గుసగుసలు మీకు వినిపిస్తాయి. అందువల్ల ఒంటరిగా ఉండండి. అప్పుడప్పుడూ మీ గుండె లోలోతుల నుంచి వచ్చే గుసగుసలను వినండి. ఒంటరిగా నడవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. టెక్నాలజీని దూరం పెట్టడం ద్వారా మెదడుకు అందుకు కావాల్సిన స్పేస్ ఇస్తున్నట్లు అవుతుంది. నేను ప్రయత్నించాను.. వీలైతే మీరూ చేయండి.. అంటూ మ్యాడీ తన వీడియోలో పేర్కొన్నారు.

ఇలా విడుదలైన వీడియో వైరల్ అవ్వడంతో.. ఈ "సైలంట్ వాకింగ్" అనే కొత్త ట్రెండ్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో... ఈ ట్రెండ్‌ ఇంట్రెస్టింగ్‌ గా ఉందని కొందరు పోస్టులు పెడుతుంటే... ఇందులో కొత్తేమీ ఉందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది... మొత్తానికి వాకింగ్‌ ఎలా చేయాలో జెన్‌ జడ్‌ ఇన్నాళ్లకు కనుగొన్నారు అంటూ ఇంకొంతమంది వెటకారం ఆడుతున్నారు.

Tags:    

Similar News