బుడమేరుకు మళ్లీ వరద ముప్పు.. ఈసారి డేంజర్ ఎవరికంటే?
తాజాగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలతో బుడమేరు మళ్లీ పోటెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పది రోజుల క్రితం విరుచుకుపడిన బుడమేరు.. మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటి మట్టం ఉందని.. అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇంత చెబుతున్నా.. బుడమేరు ఉగ్రరూపం దాలిస్తే.. లోతట్టు ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు ఖాయమన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలతో బుడమేరు మళ్లీ పోటెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే బుడమేరులో నీటిమట్టం ఒక అడుగు పెరిగింది. గండ్ల పూడ్చివేత.. కట్టల బలోపేతం పనులు వేగంగా సాగుతున్నాయి. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాలకువరద ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. భారీగా కురిసే వర్షాలతో ఏ క్షణంలో అయినా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చన్న హెచ్చరిక వణికేలా చేస్తోంది.
మళ్లీ వరదతో బుడమేరు విరుచుకుపడితే..లోతట్టున ఉన్న ఏలప్రోలు.. రాయనపాడు.. గొల్లపూడి.. జక్కంపూడి కాలనీ.. అజిత్ సింగ్ నగర్.. గుణదల.. రామవరప్పాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని.. తక్షణమే ఆయా ప్రాంతాల్ని.. ప్రజల్ని అప్రమత్తం చేయాల్సి ఉంది. అదే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో బాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.