కైవల్యకు 21, ఆదిత్ కు 22... బిలియనీర్ల జాబితాలో రికార్డ్స్!
కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా అనే ఇద్దరు భారతీయ యువకులు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు.
కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా అనే ఇద్దరు భారతీయ యువకులు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్ కోర్సును మధ్యలోనే ఆపేశారు. వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఇప్పుడు హురూన్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో కైవల్య 21 ఏళ్లకే ఈ జాబితాలో చేరిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
అవును... స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సును మధ్యలోనే ఆపేసిన కైవల్య, ఆదిత్ లు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కరోనా టైమ్ లో క్విక్ డెలివరీ, కాంటాక్ట్ లెస్ డెలివరీకి బాగా డిమాండ్ పెరగడంతో ఈ రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా 2021లో క్విక్ కామర్స్ సంస్థ జెప్టోను ప్రారంభించారు.
ప్రస్తుతం జెప్టో తన వ్యాపారాన్ని దేశీయంగా విస్తరిస్తోంది. గోసరీ డెలివరీలో అమెజాన్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్ జొమాటో - బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రూ.3,600 కోట్లతో ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు కైవల్య అత్యంత సంపన్నుల జాబితాలో పిన్నవయస్కుడిగా నిలిచి రికార్డ్ నెలకొల్పాడు.
ఇదే సమయంలో మరో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల ఆదిత్ పాలిచా రెండో స్థానంలో నిలిచాడు. వాస్తవానికి 19ఏళ్ల వయసులోనే కైవల్య వోహ్రా హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో మొదటిసారి చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ప్రతీ ఏటా తన హవా కొనసాగిస్తూ.. ఈ జాబితాలో తన స్థానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.
ఇక తాజాగా హురూన్ ఇండియా వెలువరించిన జాబితాలో రూ.11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలవగా.. రూ.10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఇక సినీ ప్రముఖుల విషయానికొస్తే... షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా, హృతిక్ రోషన్, అమితాబ్, కరణ్ జోహార్ లు టాప్ - 5లో నిలిచారు.