పవన్ కు కోర్టు సమన్లు... వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు!
ఈ సమయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ఫలితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు లాయర్ రామారావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా... నవంబర్ 22న (శుక్రవారం) వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది. పవన్ కల్యాణ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అవును... తిరుమల లడ్డూ వివాదంలో ఓ న్యాయవాది వేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిల్ ను విచారణకు స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. పవన్ కల్యాణ్ కు సమన్లు జారీ చేసింది.
కాగా... తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ.. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఆ కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలనే అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కూడా పంపించినట్లు పవన్ తెలిపారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ఫలితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు లాయర్ రామారావు. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు... పవన్ కు సమన్లు పంపింది.
ఇదే సమయంలో... తిరుమల లడ్డు వ్యవహారంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ సహా అన్ని ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంస్ నుంచి తొలగించేలా సంబంధిత శాఖకు ఆదేశాలు ఇవాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది!