మీకు తెలుసా..? ఒకప్పుడు హైదరాబాద్ సరస్సుల నగరం (లేక్ సిటీ)..

జైపూర్ అంటే పింక్ సిటీ.. లక్నో అంటే నవాబుల నగరం.. బెంగళూరు అంటే గార్డెన్ సిటీ.. మరి మన హైదరాబాద్..?

Update: 2024-08-30 13:30 GMT

జైపూర్ అంటే పింక్ సిటీ.. లక్నో అంటే నవాబుల నగరం.. బెంగళూరు అంటే గార్డెన్ సిటీ.. మరి మన హైదరాబాద్..? అటు కుతుబ్ షాహీలు.. ఇటు అసఫ్ జాహీలు.. మధ్యలో మొఘులులు పాలించిన నేల.. భారత దేశంలో రోజురోజుకు ఎదుగుతున్న నగరం.. ఒకప్పుడు భాగ్యనగరంగా ప్రసిద్ధి చెందిన నగరం. కానీ, రాన్రాను కాంక్రీట్ జంగిల్ అవుతుందనే ఆందోళన.. పెరిగిపోతున్న నగరీకరణతో చెరువులను మింగేస్తూ భారీ భవంతుల నిర్మాణం.. అయితే, ఒకప్పుడు హైదరాబాద్ కు ఉన్న పేరేమిటో తెలుసా?

సరస్సుల నేల..

ఇప్పుడంటే హైడ్రా కారణంగా అందరూ చెరువుల ఆక్రమణల గురించి మాట్లాడుతున్నారు.. అయ్యో ఇన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయా? అని నోరెళ్లబెడుతున్నారు.. అసలు హైదరాబాద్ కు ఉన్న పేరే లేక్ సిటీ (సరస్సుల నగరం) అని చాలామందికి తెలిసి ఉండదు. ఏ దిక్కున చూసిన సరస్సులతో అలరారేది భాగ్య నగరం. వీటిలోసహజమైనవి కాగా, నిర్మించినవీ ఉన్నాయి. కాలక్రమంలో ఈ సరస్సులలో చాలావరకు కనుమరుగయ్యాయి. మనుగడలో ఉన్నవి ఆక్రమణలతో కుంచించుకుపోయాయి.

తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట , అఫ్జల్‌సాగర్, నల్లకుంట , మసాబ్ ట్యాంక్.. హైదరాబాద్ లో దాదాపు కనుమరుగైన కొన్ని సరస్సులు. నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో 1970లలో వివిధ పరిమాణాల్లో ఉన్న వేలాది నీటి వనరులలో నేడు 70 నుంచి 500 వరకు మాత్రమే మనుగడలో ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం వీటిని చెరబట్టారు. చాలా సరస్సులు 16,17వ శతాబ్దాలలో కుతుబ్ షాహీల పాలనలో నిర్మితమయ్యాయి.

1575లో నిజాంలు నిర్మించిన హుస్సేన్ సాగర్ 1930లలో హైదరాబాదీల తాగునీటి వనరు. అతిపెద్ద సరస్సు అయిన దీని వైశాల్యం 30 ఏళ్లలో 40% కంటే ఎక్కువ (550 హెక్టార్ల నుంచి 349 హెక్టార్లకు) తగ్గిపోయింది. ఇక దుర్గం చెరువు వంటి పెద్ద చెరువులు పర్యాటక కేంద్రాలుగా మారగా.. చిన్నవాటిని పట్టించుకోవడం మానేశారు.

హైదరాబాద్ లో ఒకప్పుడు 250పైగా మానవ నిర్మిత సరస్సులు ఉండేవి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి నాటికి జీహెచ్ఎంసీలోని 185 సరస్సులలో 23 ఎండిపోయాయి.

కుతుబ్ షాహీల అధీనంలో గోల్కొండ ప్రఖ్యాతి చెందింది. అయితే, పెరుగుతున్న జనాభా కోసం 1589 లో 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కొత్త నగరాన్ని నిర్మించ తలపెట్టారు. మూసీ నది దక్షిణ ఒడ్డున, గోల్కొండకు తూర్పు దిశలో నిర్మించాలని దీనికి ప్రదేశం నిర్ణయించారు. నిర్మాణం ప్రారంభం సందర్భంగా కులీ కుతుబ్ షా మూసీ ఒడ్డున ఏమని ప్రార్థించాడో తెలుసా? ఓ భగవంతుడా.. ఈ నదిలో చేప పిల్లల్లాగే ‘‘నా కొత్త నగరాన్ని ప్రజలతో నింపు..‘‘ అని. ఆయన ప్రార్థించినట్లే ప్రజలతో హైదరాబాద్ నిండిపోయింది. కానీ.. నదులే కాలుష్య ప్రదేశాలుగా మారిపోయాయి.

Tags:    

Similar News