ఆగమాగం కావొద్దు.. ఇవాల్టి మూసీ కూల్చివేతల అసలు లెక్క ఇది

ఓవైపు హైడ్రా.. మరోవైపు మూసీ సుందరీకరణలో భాగంగా చేస్తున్న పనుల్ని.. వేర్వేరుగా కాకుండా ఒక్కటిగా చేసి చూపించటంతో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి

Update: 2024-10-01 10:30 GMT

తెలిసింది గోరంత. చెప్పేది కొండంత అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారింది. ఏదైనా సంచలనం చోటు చేసుకున్నంతనే వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడుకోవటం.. తాము మాట్లాడే మాటల్లోని నిజం ఎంతన్న విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుతో కొత్త గందరగోళం చోటు చేసుకుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితి. చెరువుల్లో నిర్మించిన నివాసాలు.. కట్టడాల్ని కూల్చేసేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పుణ్యమా అని.. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు.. శివారులో ఎక్కడ ఎవరు కూల్చివేతలు చేపట్టినా హైడ్రానే అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఓవైపు హైడ్రా.. మరోవైపు మూసీ సుందరీకరణలో భాగంగా చేస్తున్న పనుల్ని.. వేర్వేరుగా కాకుండా ఒక్కటిగా చేసి చూపించటంతో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ జరుగుతున్న రచ్చ ఈ కోవకు చెందిందే.

ఛాదర్ ఘాట్..మూసానగర్.. రసూల్ పుర.. వినాయక్ నగర్ లోని కొన్ని ఎంపిక చేసిన ఇళ్లను మాత్రమే రెవెన్యూ అధికారులు కూలుస్తున్నారు. సోమవారమే కదా హైకోర్టు కూల్చివేతల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది? అన్న సందేహాలు అక్కర్లేదు. ఆ కూల్చివేతలకు..తాజా కూల్చివేతలకు సంబంధం లేదు. ఆ మాటకు వస్తే.. తాజాగా జరుగుతున్న కూల్చివేతల గురించి తెలిసిన వారు ఎవరైనా.. గట్టిగా ఊపిరి పీల్చుకోవటమే కాదు.. ప్రభుత్వ చర్యను అభినందిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూల్చివేతలకు ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుందా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. అసలు విషయం తెలిస్తే మాత్రం అభినందించకుండా ఉండలేరు.

మూసీ ప్రకాక్షళనలో భాగంగా ఇటీవల ఓల్డ్ మలక్ పేట శంర్ నగర్ లో వందకు పైగా ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఇవన్నీ ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు. వారికి డబుల్ బెడ్రూంలు కూటాయించారు. అన్ని వసతులు కలుగజేశారు. దీంతో.. వారు ఖాళీ చేసిన ఇళ్లను అలానే వదిలేస్తే.. అందులోకి మరెవరైనా అక్రమించి.. నివాసాలుగా మార్చుకునే వీలుంది. అందుకే.. డబుల్ బెడ్రూం లబ్థిదారులకు చెందిన ఆక్రమణల్ని ఈ రోజు రెవెన్యూ వారు కూల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలతో ఈ కూల్చివేతల్ని కలపకూడదు. రెండు ఒక్కటి కాదన్నది నిజం. అయితే.. దీనిపై అవగాహన లేని కొన్ని యూట్యూబ్ చానళ్లు.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ కూల్చివేతలు చేపడుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో.. కొత్త గందరగోళం చోటు చేసుకుంటున్న పరిస్థితి.

Tags:    

Similar News