హైదరాబాద్ లో దసరా.. దీపావళి కలిసి వచ్చినట్లైంది

హైదరాబాద్ మహానగర రోడ్లు బోసిపోవటం.. నిత్యం ట్రాఫిక్ తో కిందా మీదా పడిపోయే నగరజీవులకు భిన్నంగా నగరం ఖాళీగా కనిపించిన పరిస్థితి.

Update: 2023-11-30 04:22 GMT

గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనూహ్య సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దసరా.. దీపావళి సందర్భంగా హైదరాబాద్ మహానగర రోడ్లు బోసిపోవటం.. నిత్యం ట్రాఫిక్ తో కిందా మీదా పడిపోయే నగరజీవులకు భిన్నంగా నగరం ఖాళీగా కనిపించిన పరిస్థితి. నవంబరు చివరి వారంలో దసరా.. దీపావళి రాకున్నా.. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఈసారి ఎన్నికలు పోటాపోటీగా సాగుతుండటం.. అధికార.. విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అభ్యర్థులంతా పోలింగ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసిన పరిస్థితి. దీంతో.. జిల్లాలకు చెందిన పలువురు నేతలు నగరంలో ఉన్న తమ ఊరి వాళ్లను ఓటు వేసేందుకు రావాలని అదే పనిగా ఒత్తిడి చేయటంతో పెద్ద ఎత్తున ఊళ్లకు వెళ్లిన పరిస్థితి. సాధారణంగా స్థానిక ఎన్నికల సందర్భంగా ఉండే ఒత్తిడి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకోవటం ఒక కొత్త పరిణామంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో పని చేసే శ్రామికులు.. వర్కింగ్ క్లాస్ మొదలుకొని ఉద్యోగులు.. ఇతర వర్గాలకు చెందిన వారంతా బుధవారం ఉదయం నుంచి ఊళ్లకు బయలుదేరిన పరిస్థితి. మధ్యాహ్నానం నాటికి ఇది మరింతగా పెరిగిపోవటంతో బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. దీని ప్రభావం హైదరాబాద్ ట్రాఫిక్ మీద పడింది. ఐటీ కారిడార్ మొత్తం దసరా.. దీపావళి పండుగ వేళలో ఎలా ఉంటుందో అలానే ఉన్న పరిస్థితి. దీనికి తోడు స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇవ్వటంతో.. ఊళ్లకు వెళ్లే వారికి మరింత ఊతంగా మారిందని చెప్పాలి.

2018లో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూడా ఊళ్లకు ఈ స్థాయిలో వెళ్లింది లేదని.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఎవరికి వారు తమ తీర్పును చెప్పాల్సన అవసరం ఉందన్న ఉద్యమ స్ఫూర్తితో ఊళ్లకు వెళ్లటంతో.. పోలింగ్ శాతం పెరిగే వీలుందని చెబుతున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని.. దసరా.. దీపావళిలో మాత్రమే కనిపించే సీన్.. ఎన్నికల పుణ్యమా అని రిపీట్ అయిన పరిస్థితి.

Tags:    

Similar News