మంకీఫాక్స్ కోసం అలర్టైన హైదరాబాద్.. గాంధీలో అప్ డేట్స్ ఇవే!
ఈ సమహ్యంలో తాజాగా మంకీఫాక్స్ (ఎంఫాక్స్) రూపంలో మరో మహమ్మారి ముంచుకొస్తుందని అంటున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో అల్లకల్లోలం చేసిందనే సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ నుంచి ఇంకా కొన్ని దేశాలు పూర్తిగా కోలుకోలేని పరిస్థితి. ఈ సమహ్యంలో తాజాగా మంకీఫాక్స్ (ఎంఫాక్స్) రూపంలో మరో మహమ్మారి ముంచుకొస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
అవును... మంకీఫాక్స్ మహమ్మారి ప్రపంచంపై దండయాత్ర చేస్తుందనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్న నేపథ్యంలో... తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా... గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులను సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ రెండు ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక వార్డులను నెలకొల్పింది. ఈ నేపథ్యంలో గాంధీలో 20 పడకలు కేటాయించారు.
ఇందులో పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా పదేసి పడకలు చొప్పున కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో... ఫీవర్ ఆస్పత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. అయితే... ఇప్పటివరకూ ఎలాంటి కేసులూ నమోదు కాలేదని.. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు... ఎంఫాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వేంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం... నైజీరియా, కాంగో, కమెరూన్ దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని.. అక్కడ నుంచి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మంకీఫాక్స్ లక్షణాలు!:
హఠాత్తుగా జ్వరం రావడం
వెన్నునొప్పి
తలనొప్పి
కండరాల నొప్పులు
కాళ్లు, చేతులు, ముఖంపై దద్దుర్లు, దురద
చలి
తీవ్ర అలసట