వామ్మో.. హైదరాబాద్‌ లో ఇవేం వానలు.. ఏకంగా రెడ్‌ అలర్ట్‌!

భారీవర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు

Update: 2023-09-05 05:27 GMT

హైదరాబాద్‌ నగరంలో కుంభవృష్టి కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పడుతున్న కుండపోత వర్షాలతో భాగ్యనగరంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎప్పటిలానే వాహనాలు సైతం కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. మరోవైపు ఎక్కడికక్కడ గంటకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ తో నగర వాసులు నరకం చూస్తున్నారు.

భారీ కుంభవృష్టితో వాతావరణ శాఖ హైదరాబాద్‌ నగరానికి రెడ్‌ అలర్డ్‌ జారీ చేసింది. తెలంగాణలో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏదైనా సమస్య ఎదురైతే సాయం కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 040–21111111, డయల్‌ 100, కంట్రోల్‌ రూమ్‌ 9000113667 నంబర్లలో సంప్రదించాలని అధికారులు కోరారు.

భారీవర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా, రోడ్లపై నీరు నిలిచిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట వాటిని వెంటనే తీసివేయాలన్నారు.

హుస్సేన్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ ల్లో నీటి స్థాయిలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తూ ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలిచ్చింది.

మంగళవారం, బుధవారం కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఆదేశించారు. ముఖ్యంగా మ్యాన్‌ హోల్స్‌ వద్ద చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సోమవారం రాత్రి నుంచి కురిసిన కుండపోత వానలతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్లలో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అమీర్‌ పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, మారేడుపల్లి, ఎల్‌బీనగర్, సాగర్‌ రింగ్‌ రోడ్, హస్తినాపురం,జీడిమెట్ల, నిజాంపేట, కూకట్‌పల్లి, ప్రగతినగర్, అల్విన్‌ కాలనీ, చిలకలగూడ, అడ్డగుట్ట, కంటోన్మెంట్, బోయిన్‌ పల్లి, కార్ఖానా, మెహిదీపట్నం, టోలిచౌకి, షేక్‌ పేట, మాదాపూర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్, దిల్‌షుక్‌ నగర్, మలక్‌పేట్, కోఠి, ఉప్పల్, తార్నాక, మెట్టుగూడలో భారీ వర్షం కురిసింది. చెట్లు కొమ్ములు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరాఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

కాగా మియాపూర్‌లో అత్యధికంగా 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. షేక్‌ పేటలో 11.9 సెం.మీ, బోరబండలో 11.6 సెం.మీ, మాదాపూర్‌ లో 10.7 సెం.మీ, రాయదుర్గంలో 10.1 సెం.మీ, ఖైరతాబాద్‌ లో 10.1 సెంమీ, రాజేంద్రనగర్‌ లో 10 సెం.మీ, గచ్చిబౌలిలో 9.6, సెం.మీ, బహదూర్‌ పురాలో 8.2 సెం.మీ, చిలకలగూడ, ఆసిఫ్‌ నగర్‌ ల్లో 8.1 సెం.మీ వర్షపాతం చోటు చేసుకుంది.

మరోవైపు రాజేంద్రనగర్‌ లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ 2 గేట్లు ఎత్తివేశారు. మొత్తం 4 గేట్లు ఓపెన్‌ చేస్తామని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

భారీ వర్షాలతో హైదరాబాద్‌ నగరంలో పాఠశాలలు, కాలేజీలతోపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా ఆరామ్‌ ఘర్‌ వద్ద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలగించాయి. శ్రీనగర్‌లో వర్షం నీటిలో చిక్కుకున్న మరో బస్సును జీహెచ్‌ఎంసీ ఎంఈటీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు పక్కకు తప్పించాయి.

సోమవారం రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైనా మంగళవారం తెల్లవారుజామున ఇవి ఉధృత రూపం దాల్చాయి. పాతబస్తీ, సెంట్రల్‌ హైదరాబాద్, సికింద్రాబాద్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హబ్, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి శివార్లలో భారీ వర్షం కురిసింది.

Tags:    

Similar News