కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ చర్చ... రేవంత్ రియాక్షన్ ఇదే!
ఈ సమయంలో హైదరాబాద్ ఫ్యూచర్ పై పలువురు పొలిటీషియన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో... 2014 జూన్ 2న నుంచి పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అయితే... ఈ ఏడాది జూన్ 2 తో ఆ గడువు ముగియనుంది. మరోపక్క ఏపీలో జూన్ 4తర్వాత కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంపై క్లారిటీ రానుంది. ఈ సమయంలో హైదరాబాద్ ఫ్యూచర్ పై పలువురు పొలిటీషియన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇందులో భాగాంగా... మరికొంతకాలం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలని కొందరంటుంటే... బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో జూన్ 2 తర్వాత ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభిస్తారనే అనుమానం తనకు ఉందని అన్నారు.
అక్కడితో ఆగని ఆయన... బీజేపీ, కాంగ్రెస్ మధ్య హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే విషయంపై ఒక అవగాహన ఉందని, ఓ ఒప్పందం కుదిరిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఈ విషయంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీజీ ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు.
అవును... కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే కామెంట్స్ పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా... హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ సరికావని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
ఇదే సమయంలో ఈ లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని జోస్యం చెప్పిన రేవంత్... ఎవరికీ కేంద్రపాలిత ప్రాంతం భయం అక్కర్లేదని వెల్లడించారు. ఒకవేళ హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేసినా.. రాష్ట్ర ఆదాయం ఏ మాత్రం తగ్గదని స్పష్టం చేశారు. దీంతో... కేంద్రపాలిత ప్రాంతం అంశంపై రేవంత్ క్లారిటీ ఇచ్చినట్లే నని అంటున్నారు నగర వాసులు! అయితే... పూర్తి క్లారిటీ జూన్ 2 తర్వాత రానుందని మరికొందరు చెబుతున్నారు.