"కుమార్ అంకుల్"... హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్!
తాజాగా ఆమె ఫేమస్ డైలాగ్ "మీది మొత్తం 1000 అయింది" ని హైదరబాద్ పోలీసులు ఉపయోగిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇటీవల కాలంలో కుమారీ ఆంటీ నెట్టింట వైరల్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రోడ్డుపక్కన భోజనం అమ్మే ఈమె... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ కలిగి ఉంది! ఒక్కమాటలో చెప్పాలంటే... కుమారీ ఆంటీ గురించి తెలియని సోషల్ మీడియా యూజ ర్ ఉండడు అన్నా అతిశయోక్తి కాదన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.
పైగా ఇటీవల ఆమె హోటల్ ని ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతుందంటూ ట్రాఫిక్ పోలీసులు తొలగించే ప్రయత్నం చేయడం.. దీనిపై నెట్టింట తీవ్రంగా రియాక్షన్ రావడం.. దీంతో ఈ విషయంపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించడంతో.. కుమారీ ఆంటీ ఫాలోయింగ్ పీక్స్ కి చేరింది. ఇదే సమయంలో... "మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా" అనే డైలాగ్ ఇన్ స్టా ను కుదిపేసింది.
ఈ ఫ్లోలో ఆమె ఇటీవల పలు టీవీ షోల్లో కూడా కనిపించి సందడి చేసింది. ఇదిలా ఉండగా... తాజాగా ఆమె ఫేమస్ డైలాగ్ "మీది మొత్తం 1000 అయింది" ని హైదరబాద్ పోలీసులు ఉపయోగిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... హైదరాబాద్ సిటీలో ఒక బైకర్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. పైగా ఆ సమయంలో బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. దీంతో అతన్ని ఫొటో తీసిన ట్రాఫిక్ పోలీస్.. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో... "మీది మొత్తం 1000 అయింది. యూజర్ చార్జెస్ ఎక్స్ ట్రా" అని ట్వీట్ పెట్టారు.
దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో షాకైన నెటిజన్లు... ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న మరికొంతమంది బైకర్స్ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. వాటికి ఎంతెంతె చలాన్ పడే అవకాశాలున్నాయో చెప్పాలంటూ అడుగుతుండగా... మరొకరు మాత్రం "ఈయన కుమార్ అంకుల్" అంటూ కామెంట్ చేశారు.