శుక్రవారం పొద్దున్నే మొదలుపెట్టిన 'హైడ్రా'... శనివారం టెన్షన్ స్టార్ట్!?
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఈ వారం హైడ్రా విరుచుకుపడేది ఎక్కడ అనే చర్చ నెట్టింట మొదలవుతుండటం గమనార్హం.
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఈ వారం హైడ్రా విరుచుకుపడేది ఎక్కడ అనే చర్చ నెట్టింట మొదలవుతుండటం గమనార్హం. ప్రధానంగా గత శనివారం తెల్లవారుజామునే హైడ్రా బుల్డోజర్లు మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ దగ్గర దర్శనమిచ్చి.. విషయం ప్రపంచానికి తెలిసేలోపు దాదాపు పని పూర్తి చేసిన పరిస్థితి!
దీంతో... ఈ శనివారం హైడ్రా ఎవరిపై విరుచుకుపడబోతోంది.. ఏ అక్రమ నిర్మాణాలపైకి తన బుల్డోజర్లను పంపనుంది.. ఏ సంచలనాలకు తెరలేపనుంది అనే విషయాలపై చర్చ మొదలైంది. అయితే అంచనాలను అందకుండా హైడ్రా ఈ వారం మాత్రం శుక్రవారమే పని మొదలుపెట్టేసింది. దీంతో... ఈ వారం కాస్త ఎర్లీగా మొదలైనంట్లుందనే కామెంట్లు మోలైపోయాయి.
అవును... ఎన్ కన్వెషన్ విషయంలో వీకెండ్ చూసుకుని అన్నట్లుగా శనివారం తెల్లవారు జామునే పని మొదలుపెట్టేసింది హైడ్రా. ఆ షాక్ నుంచి తేరుకుని, ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకునేలోపు ఆల్ మోస్ట్ పని పూర్తయ్యిందని అంటున్నారు. అయితే... ఈసారి మాత్రం శుక్రవారం ఉదయాన్నే పని ప్రారంభించింది హైడ్రా.
ఇందులో భాగంగా... తాజాగా హైడ్రా అధికారులు సికింద్రబాద్ నడిబొడ్డున ఉన్న రాంనగర్ వద్ద దర్శనమిచ్చారు! నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని అడిక్ మెట్ లో నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ వాటిపై శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ మేరకు జేసీబీలు అవిరామంగా వాటిపని అవి చేసుకుంటూ పోయాయి!
ఇలా శుక్రవారం ఉదయాన్నే ఈ ప్రాంతంపై హైడ్రా విరుచుకుపడింది. ఈ విషయం బయటకు తెలిసే లోపు దాదాపు సగం పని పూర్తైందని అంటున్నారు. అయితే ఈ నిర్మాణాలను రెండు రోజుల కిందటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లారని.. నివేదికలు తెప్పించుకున్నారని.. అక్రమ నిర్మాణాలని కన్ఫాం చేసుకోగానే బుల్డోజర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఇలా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చి వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... తమకు నోటీసులు ఇవ్వకుండా, ఓ అవకాశం ఇవ్వకుండా ఇలా చేయడం ఏమిటని యజమానులు వాపోతుండగా... అక్రమం అని తెలిసి నిర్మించిన తర్వాత నోటీసులతో పనేముంది, తుడుచుకుపోవడమే అనేది మరికొంతమంది మాటగా ఉంది!
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లో శుక్రవారమే పని ప్రారంభించిన హైడ్రా... శనివారం ఏ నిర్మాణాలను టార్గెట్ చేసిందనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా... ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హైడ్రా గురించిన చర్చే!