కామెడీ చేసిందెవరు? నన్నుకమెడియన్ అంటారేంది? హైపర్ ఆది
తాను చెప్పాలనుకున్న విషయాలన్ని సూటిగా..సుత్తి లేకుండా చెప్పేసే ప్రముఖులు చాలా తక్కువమంది ఉంటారు.
తాను చెప్పాలనుకున్న విషయాలన్ని సూటిగా..సుత్తి లేకుండా చెప్పేసే ప్రముఖులు చాలా తక్కువమంది ఉంటారు. అందునా సెలబ్రిటీ హోదా ఉన్న వారి మాటలు షార్ప్ గా ఉండవన్న విమర్శ ఉంటుంది. అయితే.. ఇలాంటి వాటికి భిన్నంగా ఉంటారు హైపర్ ఆది. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితులైన హైపర్ ఆది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎంతలా అభిమానిస్తారో.. మరెంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తెనాలిలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆయన.. తన మాటల పవర్ తో అదరగొట్టేశారు.
తన ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించటమే కాదు.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కామెడీ చేస్తానంటూ తనను కమెడియన్ అంటూ విమర్శలు చేస్తున్నారన్న ఆయన..కామెడీ చేసిందెవరు? కమెడియన్ ఎవరు? అంటూ తన ప్రత్యర్థులపై ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. ఇంతకూ కామెడీ.. కామెడీ అంటూ హైపర్ ఆది సంధించిన ‘కామెడీ అస్త్రాల్ని’ ఆయన మాటల్లోనే చదవితే.. ‘‘మద్యపాన నిషేధం చేస్తానంటూ కామెడీ చేసిందెవరు? మూడు రాజధానులు అంటూ కామెడీ చేసిందెవరు? గెలిచినంతనే పెన్షన్ రూ.3వేలు మీ అకౌంట్లో పడతాయంటూ కామెడీ చేసిందెవరు? సీపీఎస్ రద్దు చేస్తానంటూ కామెడీ చేసిందెవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిందెవరు?’’ అంటూ ప్రశ్నిస్తూ తన చుట్టూ ఉన్న వారి చేత సీఎం జగన్మోహన్ రెడ్డి అనిపించిన ఆది.. ‘‘కామెడీ మొత్తం వాళ్లు చేసి నన్ను కమెడియన్ అనటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
తాము జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్లం మాత్రమేనని.. వారి మాదిరి పొలిటికల్ కమెడియన్స్ కాదన్న ఆది.. ‘‘తెనాలిలో మనోహర్ ను భారీ మెజార్టీతో విజయం సాధించేలా చేయాలి. అసెంబ్లీలో స్పీకర్ అన్నంతనే అందరికి గుర్తుండిపోయేలా ఆ బాధ్యతను నిర్వర్తించింది మనోహర్. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెనాలిలో జరిగిందే డెవలప్ మెంట్. ఆ తర్వాత ఇంకేమీ డెవలప్ మెంట్ జరగలేదు’’ అని వ్యాఖ్యానించారు. తన పంచ్ డైలాగులతో అదరగొట్టే హైపర్ అది.. ఎన్నికల ప్రచారంలోనూ తనదైన మార్కును ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది.