వావ్.. అంగన్ వాడీలో ఐఏఎస్ కూతురు
అలాంటి స్ఫూర్తిని రగిలించే పని చేశారు ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి.
మాటలు ఎవరైనా చెబుతారు. కానీ.. చేతల్లోకి వచ్చేసరికే అవేమీ కనిపించవు. ఆదర్శాలు వల్లించటం కాదు.. వాటిని ఫాలో కావటం అంత తేలికైన విషయం కాదు. అందునా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి అయితే అస్సలు సాధ్యం కాదు. సినిమాల్లో చూపించే కొన్ని సీన్లు చూస్తే.. రియల్ లైఫ్ లో ఇలాంటివి సాధ్యమవుతాయి? ఆదర్శవంతంగా ఉండటం ఎలా అన్నట్లుగా చూపే సినిమాటిక్ సీన్లు నిజ జీవితంలో ఏ మాత్రం వర్కువుట్ కావని.. అందులో లాజిక్ ఉండదన్న వాదనను వినిపిస్తారు. కానీ..రేర్ గా అలాంటి సాహసాల్ని చూసే వారు కొందరు ఉంటారు. సామాన్యులు చేసే పనులు గుర్తింపు రావటానికి చాలానే టైం పడుతుంది.
కానీ.. అందుకు భిన్నంగా ప్రముఖులు చేసే పనులు వెంటనే గుర్తింపులోకి రావటమే కాదు.. అలాంటి వారి ఆదర్శం మరెందరికో స్ఫూర్తిని ఇస్తుంది. అలాంటి స్ఫూర్తిని రగిలించే పని చేశారు ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి. సాధారణంగా సంపన్న వర్గాలు.. అత్యుత్తమ అధికారంలో ఉన్న వారు తమ పిల్లల చదువుల కోసం అత్యుత్తమైన వాటిని ఎంపిక చేసుకోవటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థల్లో చేర్పించటానికి ససేమిరా అనే పరిస్థితి.
ఇలాంటి వేళలో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించిన ఏపీ ఐఏఎస్ అధికారి తీరు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా వ్యవహరిస్తున్న సూరజ్ గనోరే తన మూడేళ్ల కుమార్తె స్రష్టి గనోరేను స్థానికంగా ఉన్న ఎర్రంరెడ్డి నగర్ లోని అంగన్ వాడీ కేంద్రంలో చేర్చారు. సాధారణంగా ఐఏఎస్ అధికారి స్థాయి వారు తమ పిల్లల్ని అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్చటమనే పనే చేయరు. అందుకు భిన్నంగా నలుగురికి ఆదర్శంగా నిలిచేలా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి నిర్ణయానికి ఫిదా కావటమే కాదు ఆయన్ను శభాష్ అనకుండా ఉండలేం. అంతేకాదు.. ఆయన సతీమణికి కూడా సలాం చేయాల్సిందే. భర్త నిర్ణయానికి మద్దతుగా నిలిచి అంగన్ వాడీ కేంద్రానికి తన కుమార్తెను పంపేందుకు ఆమె అంగీకరించటం సామాన్యమైన విషయం కాదు కదా?