భారత్‌ కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. ‘శివశక్తి’ ఇక అధికారికం!

అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశం ఎవరికీ తీసిపోని విజయాలను సాధించింది. అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్‌ ప్రయోగం చేపట్టిన దేశంగా నిలిచింది.

Update: 2024-03-25 05:16 GMT

అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశం ఎవరికీ తీసిపోని విజయాలను సాధించింది. అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్‌ ప్రయోగం చేపట్టిన దేశంగా నిలిచింది. అంతేనా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ను దింపిన దేశంగా చరిత్ర పుటలకెక్కింది.

ఈ నేపథ్యంలో చంద్రయాన్‌–3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రదేశాన్ని ‘శివ శక్తి’గా పిలుస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 23న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 7 నెలల తర్వాత అంతర్జాతీయ ఖగోళ సంఘం (ఐఏయూ) ఈ నెల 19న ‘శివశక్తి’ పేరుకు అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.

ఈ మేరకు అంతర్జాతీయ ఖగోళ సంఘం (ఐఏయూ) ఆమోదించిన గ్రహాల పేర్లు, వాటి వివరాల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించే ‘గెజిటరీ ఆఫ్‌ ప్లానెటరీ నోమెన్‌ క్లేచర్‌’.. చంద్రయాన్‌–3లోని విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి ‘శివ శక్తి’ అనే పేరును ఐఏయూ వర్కింగ్‌ గ్రూప్‌ ఫర్‌ ప్లానెటరీ సిస్టమ్‌ ఖరారు చేసిందని వెల్లడించింది.

దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ((ఇస్రో)) విజయానికి గుర్తుగా ‘శివ శక్తి’ పేరు అధికారికంగా ఖరారైనట్టయింది. ‘ప్రకృతి పురుషుడు (శివుడు), స్త్రీ (శక్తి) అర్థాలను వర్ణించే భారతీయ పురాణాల నుంచి సేకరించిన పదమే ‘శివ శక్తి’ అని ‘గెజిటరీ ఆఫ్‌ ప్లానెటరీ నోమెన్‌ క్లేచర్‌’ తెలిపింది.

కాగా, అంతరిక్షంలో భారత ఆధిపత్యం కేవలం చంద్రయాన్‌–3కే పరిమితం కాలేదని, ఖగోళ శాస్త్రవేత్తలు ‘శివ’, ‘శక్తి’ అనే పేర్లతో పాలపుంతలోని రెండు పురాతన నక్షత్రాల సమూహాలను గుర్తించారని పలువురు కొనియాడుతున్నారు.

చంద్రయాన్‌–3 మిషన్‌ ను ఇస్రో జులై 14న చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ ను ప్రయోగించింది. సుధీర్ఘ సమయం అనంతరం విక్రమ్‌ ల్యాండర్‌ ఆగస్టు 23న సాయంత్రం 6.43 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇస్రో రూ.615 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్వహించింది.

Tags:    

Similar News