సంయ‌మ‌నం కోల్పోతే.. మొత్తానికి ఎస‌రే ప‌వ‌న్ స‌ర్‌!

నాకు మొద‌టిది ఉంది కానీ.. రెండోది లేదు. అందుకే త‌ప్పుకొన్నా`` అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న చిరంజీవి.. త‌న పార్టీ ప్ర‌జారాజ్యాన్ని విలీనం చేసిన స‌మ‌యంలోనే చెప్పుకొచ్చారు.

Update: 2024-01-26 15:15 GMT

రాజ‌కీయాల్లో భావోద్వేగాల‌కు తావులేదు. అవి ఉన్నాయా.. చాలా వ‌ర‌కు క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు పార్టీల జెండాలు కూడా ఎత్తేయాల్సి రావొచ్చు. ఈ విష‌యం.. పార్టీ అధినేత‌లుగా ఉన్న‌వారికి చాలా అవ‌స‌రం. అభిమానులు రెచ్చ‌గొట్టార‌నో.. నాయ‌కులు తిర‌గ‌బ‌డుతున్నార‌నో.. లేక‌.. త‌న‌పై లేనిపోనివి ప్ర‌చారం చేస్తున్నార‌నో.. నాయ‌కులు తొంద‌ర‌ప‌డి ప్ర‌జాబాహుళ్యంలో నోరు చేసుకుంటే.. అది మ‌రింత ముప్పుగా ప‌రిణ‌మించ‌డం ఖాయ‌మ‌ని చెప్పేందుకు అనేక ఉదంతాలు ఉన్నాయి.

``కొంత ఓర్పు.. మ‌రింత నేర్పు ఉంటే త‌ప్ప రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం చాలా క‌ష్టం. నాకు మొద‌టిది ఉంది కానీ.. రెండోది లేదు. అందుకే త‌ప్పుకొన్నా`` అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న చిరంజీవి.. త‌న పార్టీ ప్ర‌జారాజ్యాన్ని విలీనం చేసిన స‌మ‌యంలోనే చెప్పుకొచ్చారు. అంటే.. రాజ‌కీయాల‌లో ఓర్పు, నేర్పు కూడా చాలా ముఖ్య‌మనేది స్ప‌ష్టంగా తెలుస్తుంది. కానీ.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇన్నాళ్లుగా చాలా నేర్పుగా మాట్లాడిన‌ప్ప‌టికీ.. మాట‌ల కూర్పుతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు, ఇన్నాళ్లుగా క‌ట్టుకున్న రాజ‌కీయ గూడుపై తుఫాను కురిపిస్తున్నాయి.

టీడీపీ-జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది ఒక ఒప్పందం. రాజ‌మండ్రి వేదిక‌గా ప‌వ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసే పోటీ చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. సో.. ఆయ‌న అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటారు క‌దా!? కాబ‌ట్టి.. పొత్తులు అన్నాక‌.. అనేక చిన్నా చిత‌కా స‌మ‌స్య‌లు కామ‌న్‌గా వ‌స్తాయ‌నే విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించాలి. అదేస‌మ‌యంలో టికెట్ల వ్య‌వ‌హారం.. మ‌రింత ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం కూడా ఉండొచ్చు. అయిన‌ప్ప‌టికీ.. పొత్తు ప్ర‌యాణం స‌జావుగా సాగాలంటే.. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌కుండా ఉండ‌డ‌మే ప్ర‌ధాన విష‌యం.

కానీ, తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపాయి. ``వారికి ఒత్తిడి ఉన్నట్టే నా మీదనా ఒత్తిడి ఉంది. అందుకే రిపబ్లిక్ డే రోజున... R అక్షరం బాగుంది, RRR (త్రిబులార్ ) లాగ రాజోలు, రాజానగరం ప్రకటిస్తున్నాం. ఆ రెండు సీట్ల నుంచి జనసేన పోటీ చేస్తుంది అని మీకు మాటిస్తున్నాను అని పవన్ వ్యాఖ్యానించ‌డం.. అక్క‌డిక‌క్క‌డే రెండు స్థానాలు మ‌న‌వేన‌ని చెప్ప‌డం జ‌న‌సేన‌లో ఊపు తెస్తే తేవ‌చ్చేమో కానీ.. పొత్తుల ప‌రంగా చూసుకుంటే.. ప్ర‌జ‌ల్లో వీక్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

పైగా కీల‌క‌మైన ఎన్నిక‌ల ముందు.. ఇలా సంయ‌మ‌నం లేని వ్యాఖ్య‌ల‌తో వీధి ప‌డితే.. ఇరు ప‌క్షాల‌కూ న‌ష్ట‌మే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నేది వాస్త‌వం. ప్ర‌స్తుతం ఇండియా కూట‌మిలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తున్న ద‌రిమిలా.. కొంత సంయ‌మ‌నం.. మ‌రింత ఓర్పు లేక‌పోతే.. మ‌రో రెండు నెల‌ల నాటికి ప‌రిస్థితి దారి త‌ప్పే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News