మోడీ గ్యారెంటీ... పోస్టాఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే 3వేలంట!?

ఈ క్రమంలోనే తాజాగా మోడీ గ్యారెంటీ అంశం హల్ చల్ చేస్తుంది!

Update: 2024-03-21 16:49 GMT

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో మెజారిటీ వార్తలు సత్యదూరాలే అని అంటుంటారు. కానీ... కనీసం పదిశాతం మాత్రం కచ్చితంగా వాస్తవానికి దగ్గర ఉంటాయని చెబుతుంటారు. అయితే వైరల్ అవుతున్న అంశం 90శాతంలోకి వెళ్తుందా.. 10శాతం కోటాలోకి వస్తుందా అనేది తెలుసుకోవడం అనేది అత్యంత కీలకం! ఈ క్రమంలోనే తాజాగా మోడీ గ్యారెంటీ అంశం హల్ చల్ చేస్తుంది!

అవును... సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనే విషయాన్ని తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని అంటారు. పైగా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చే విషయాలపై శ్రద్ధ మరింత ముఖ్యమని అంటారు. ఈ క్రమంలో తాజాగా మోడీ గ్యారెంటీ పథకం అంటూ ఒక అంశం ప్రచారంలోకి వచ్చింది.

ఇందులో భాగంగా... పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక్కో అకౌంట్ లోనూ రూ. 3000 లు జమచేస్తారని.. ఈ పథకం పేరు మోడీ గ్యారెంటీ అని కర్ణాటక రాష్ట్రంలో వదంతులు వ్యాపించాయి. దీంతో... హుబ్లీ, ఉద్యాం నగర్, నవనగర్, గిర్నీచాల్ తదితర ప్రాంతాల్లోని మహిళలు పోస్టాఫీసులకు పోటెత్తారు.

దీంతో... కర్ణాటకలోని పైన పేర్కొన్న ప్రాంతాల్లో పోస్టాఫీసులు కిటకిట లాడటం మొదలుపెట్టాయి. మరోపక్క... ఇలాంటి పథకం ఏమీ లేదని అధికారులు, సిబ్బంది చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా తమకు అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు మహిళలకు నచ్చచెప్పుతున్నారు.

కాగా... సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. కోవిడ్ సమయంలోనూ అన్ లాక్ 5.0 లో భాగంగా ప్రతీ బ్యాంక్ అకౌంట్ లలోనూ మోడీ రూ.3000 జమచేయబోతున్నారని.. దీనిపేరు ప్రధానమంత్రి మన్ ధన్ యోజన అని ఒక వీడియో యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. దీంతో... ఆ వీడియోపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి ఖండించాల్సి వచ్చింది.

Tags:    

Similar News