ఒత్తిడి పెంచేస్తున్నారా ?

జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేస్తుంది ? పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవన్న విషయం అధికారికంగా ఇంతవరకు ప్రకటనకాలేదు.

Update: 2024-02-02 10:30 GMT

రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న సీనియర్ తమ్ముళ్ళు చాలామంది చంద్రబాబునాయుడుపై రకరకాల మార్గాల్లో ఒత్తిళ్ళు పెంచేస్తున్నారు. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేస్తుంది ? పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవన్న విషయం అధికారికంగా ఇంతవరకు ప్రకటనకాలేదు. దాంతో తమ్ముళ్ళలో చాలామందిలో అయోమయం పెరిగిపోతోంది. అందుకనే తాము పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించకూడదని, టికెట్ తమకే ఇవ్వాలన్న పాయింట్ల మీద ఒత్తిళ్ళు పెంచేస్తున్నారు.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో సీనియర్ తమ్ముడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీనే దీనికి ఉదాహరణ. వెస్ట్ నియోజకవర్గంలో తాను పోటీచేయాలని చాలాకాలంగా బుద్ధా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సీటును జనసేనకు కేటాయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్ధిగా తానే పోటీచేయబోతున్నట్లు పోతిన మహేష్ ప్రచారం కూడా చూసుకుంటున్నారు. అందుకనే పోతిన కు తమ్ముళ్ళకు మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే బుద్ధా పెద్ద ర్యాలీ చేశారు. ఇదే సీటును మరో సీనియర్ తమ్ముడు జలీల్ ఖాన్ కూడా ఆశిస్తున్నారు. ఈయన మైనారిటి సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు.

ఇక కొవ్వూరులో మాజీమంత్రి కేఎస్ జవహర్ కు టికెట్ ఇవ్వద్దని నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకులు పెద్ద ర్యాలీ చేశారు. జవహర్ కే టికెట్ ఇస్తే ఓటమి గ్యారెంటీ అని గోల చేస్తున్నారు. ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియకు టికెట్ ఇవ్వద్దని సీనియర్ తమ్ముళ్ళతో పాటు భూమా కుటుంబసభ్యులు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గాలను జనసేనకు కేటాయించద్దని గొల్లపల్లి సూర్యారావు, బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాలు పార్టీ ఆపీసులో నానా రచ్చచేసిన విషయం తెలిసిందే.

పెనమలూరులో వైసీపీ అసంతృప్త ఎంఎల్ఏ కొలుసు పార్ధసారధికి టికెట్ ఇస్తే ఒప్పుకునేదిలేదని మాజీ ఎంఎల్ఏ బోడె ప్రసాద్ ఇప్పటికే పార్టీకి వార్నింగిచ్చారు. అందుకనే కొలుసును పెనమలూరులో కాకుండా నూజివీడులో పోటీచేయమని చంద్రబాబు చెప్పారు. అయితే ఇక్కడ కూడా కొలుసుకు టికెట్ ఇచ్చేందుకు లేదని సీనియర్ తమ్ముళ్ళు గోల మొదలుపెట్టారు. ఎవరికి అందుబాటులో ఉన్న మార్గాల్లో టికెట్ల కోసం తమ్ముళ్ళు చంద్రబాబుపై ఒత్తిడిపెంచేస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు చివరకు ఏమవుతాయో చూడాల్సిందే.


Tags:    

Similar News

ఇక ఈడీ వంతు