20 ఏళ్లలో భారత్ కు భారీగా రానున్న విమానాలు

దేశీయంగా యమా వేగంగా దూసుకెళుతున్న పరిశ్రమల్లో విమానయాన రంగం ఒకటి. గడిచిన పదేళ్లలో దేశీయంగా ప్యాసింజర్ విమానాల సంఖ్య భారీగా పెరిగింది.

Update: 2025-02-10 04:25 GMT

దేశీయంగా యమా వేగంగా దూసుకెళుతున్న పరిశ్రమల్లో విమానయాన రంగం ఒకటి. గడిచిన పదేళ్లలో దేశీయంగా ప్యాసింజర్ విమానాల సంఖ్య భారీగా పెరిగింది. 2014లో కేవలం 400 విమానాలు మాత్రమే ఉన్న భారత విమానయాన రంగం ఇప్పుడు అందుకు భిన్నంగా 644 విమానాలకు చేరుకుంది. అంతకంతకూ డెవలప్ అవుతున్న ఈ రంగంలోని అవకాశాన్ని మరింతగా అందిపుచ్చుకునేందుకు వీలుగా.. పౌర విమానయాన సంస్థలు భారీగా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావటమే కాదు.. భారీగా ఆర్డర్లు ఇచ్చేయటం తెలిసిందే.

తాజాగా అమెరికాకు చెందిన దిగ్గజ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఒక రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం రానున్న 20 ఏళ్లలో భారత్ తో పాటు.. దక్షిణాసియా మార్కెట్ కు ఎన్ని విమానాలు అవసరమవుతాయన్న అంశాన్ని లెక్కించింది. దీని ప్రకారం రానున్న 20 ఏళ్లలో కొత్తగా 2835 విమానాలను సమకూర్చుకోనున్నట్లుగా అంచనా వేశారు. వీటిలో న్యారో బాడీ విభాగంలో 2445 విమానాలు.. వైడ్ బాడీ సెగ్మెంట్ లో 370 విమానాల డిమాండ్ ఉండొచ్చని పేర్కొన్నారు.

మరోవైపు పెరుగుతున్న పౌర విమాన ప్రయాణాల నేపథ్యంలో భారతీయ ప్రయాణికుల అవసరాల్ని తీర్చేందుకు 3800 కంటే ఎక్కువ విమానాల అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా దేశీయ పౌర విమానయాన సంస్థలు వివిధ సంస్థలకు ఇచ్చిన విమాన ఆర్డర్లను ఉటంకిస్తున్నారు. దేశీయ మార్కెట్ లో తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్న ఇండిగో.. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా..అకాశ సంస్థలు 1620 విమానాల్ని ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చి ఉండటం తెలిసిందే. వీటిని షెడ్యూల్ ప్రకారం డెలివరీ చేయనున్నారు.

దేశీయంగా చూస్తే విమానయాన రద్దీని కలిగి ఉన్న విమానాశ్రయాల్ని చూస్తే.. ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. హైదరాబాద్ లు ఉన్నాయి. దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో మార్కెట్ షేర్ 64.4 శాతం కాగా.. ఎయిర్ ఇండియా 26.4 శాతం.. అకాశ 4.6 శాతం, స్పైస్ జెట్3.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దేశీయంగా రానున్న ఐదేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసే విమానశ్రయాల సంఖ్య పెరగనుంది.

రానున్న ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా 50 కొత్త ఎయిర్ పోర్టుల్ని ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తోంది. గడిచిన పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరగటం గమనార్హం. ప్రస్తుతం 137 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిల్లో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు.. 81 దేశీయ విమానాశ్రయాలు.. 23 సివిల్ ఎన్ క్లేవ్ లతో పాటు 10 కస్టమ్స్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి.

Tags:    

Similar News