మన నేవీతో పెట్టుకోలేరు

మూడు శక్తిమంతమైన అస్త్రాలు ఒకేసారి నౌకాదళంలో చేరడం చరిత్రలో ఇదే తొలిసారి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో వీటిని తయారు చేశారు.

Update: 2025-01-16 05:23 GMT

భారత నావికాదళానికి కొత్త అస్త్రాలు సమకూరాయి. ఒకేసారి మూడు శక్తివంతమైన అస్త్రాలు చేరడంతో మన నావికాదళంలో ప్రపంచంలో అగ్రశేణి నావికాదళాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశ నౌకాదళ చరిత్రలో తొలిసారి ఓ డిస్ట్రాయర్‌, ఓ ఫ్రిగిట్‌ తోపాటు జలాంతర్గామి ముంబైలో జలప్రవేశం చేశాయి. యుద్ధనౌకలైన ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను బుధవారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

మూడు శక్తిమంతమైన అస్త్రాలు ఒకేసారి నౌకాదళంలో చేరడం చరిత్రలో ఇదే తొలిసారి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో వీటిని తయారు చేశారు. సముద్ర రక్షణలో ఇప్పటికే భారత నేవీ సత్తా చాటుతోంది. హిందూ మహాసముద్రంలో ఎలాంటి అలజడి రేగినా తొలిగా స్పందించేది ఇండియన్ నేవీనే. సముద్ర దొంగల ఆట కట్టించడంతోపాటు విపత్తుల సమయాల్లో ప్రాణాలను రక్షించడంలో నేవీ పాత్ర ఉంటోంది.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, సహకారం, అభివృద్ధికి భారత్‌ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. భవిష్యత్‌లో ప్రపంచంలో కీలకమైన శక్తిగా ఎదిగేందుకు సముద్రగర్భంలోని అత్యంత లోతులను శోధించే శక్తిని భారత్‌ పెంచుకుంటోంది. 6 వేల మీటర్ల లోతుల్లో కూడా అన్వేషణ కొనసాగించే టెక్నాలజీని సొంతం చేసుకుంది. నౌకాదళంలో ‘మేడిన్‌ ఇండియా’ శక్తిసామర్థ్యాలు శరవేగంగా పెంచుకున్న నేవీ 2014 తర్వాత రెండింతలైన నౌకాదళ శక్తిగా అవతరించింది. గత పదేళ్లలో 33 నౌకలు, ఏడు జలాంతర్గాములను సమకూర్చుకున్న నేవీ సముద్ర వ్యవహారాల్లో గ్లోబల్‌ లీడర్‌గా ఎదుగుతోంది.

Tags:    

Similar News