అతి చేస్తున్న కెనడా.. విదేశీ విద్యార్థుల నిరసనతో కొత్త రచ్చ

మారిన రోజులకు అనుగుణంగా మారని కొన్ని దేశాలు ఉంటాయి. ఆ కోవలోకే వస్తోంది కెనడా.

Update: 2024-08-28 04:38 GMT

మారిన రోజులకు అనుగుణంగా మారని కొన్ని దేశాలు ఉంటాయి. ఆ కోవలోకే వస్తోంది కెనడా. మొన్నటివరకు ఒకలాంటి తీరును ప్రదర్శించిన ఆ దేశం.. ఇప్పుడు విదేశీ విద్యార్థులు తమ దేశానికి రాకుండా ఉండేందుకు వీలుగా తీసుకుంటున్న నిర్ణయాలు.. చేపడుతున్న చర్యలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీంతో.. కెనడాలో ఉన్న వేలాది మంది విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా విదేశీ విద్యార్థులు పలువురు ఆందోళన బాట పట్టటం గమనార్హం.

విదేశీ విద్యార్థుల్ని తగ్గించుకోవటానికి వీలుగా చేస్తున్న చర్యల్లో భాగంగా జస్టిన్ ట్రూడో నేరుగా సీన్లోకి వచ్చేశారు. దీనికి కారణం విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను పరిమితం చేయటం.. పర్మినెంట్ రెసిడెన్సీ నామినేషన్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని విదేశీ విద్యార్థులు దేశ వ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ ఎడ్వర్ట్ ఐలాండ్.. అంటారియో.. మనితోబా.. బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.

ఇటీవల సమావేశమైన కేబినెట్.. విదేశీ వర్కర్ల విధానంలో మూడు కీలక మార్పులు చేశారు. వాటిని సెప్టెంబరు 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉపాధి అవకాశాల్ని విదేశీ తాత్కాలిక కార్మికులు తక్కువ జీతాలకు పని చేయటానికి ముందుకు రావటంతో అక్కడి సంస్థలు వారికి అవకాశాల్ని ఇస్తున్నాయి. ఈ కారణంగా కెనడియన్ల ప్రయోజనాలు దెబ్బ తింటున్నట్లుగా ట్రూడో సర్కారు భావిస్తోంది.

ఇందులో భాగంగా స్టడీ పర్మిట్లలో కోత విధించటం.. విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించటం.. శాశ్విత నివాస పర్మిట్లను తగ్గించటం లాంటి చర్యల్ని చేపడుతున్నారు. అయితే.. తాము తీసుకున్న నిర్ణయాన్ని ట్రూడో సర్కారు సమర్థించుకుంటోంది. దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరత.. నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టటం కోసమే తాము నిర్ణయాల్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ట్రూడో సర్కారు తీరుపై విదేశీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చేసిన మార్పుల కారణంగా దాదాపు 70వేల మందికి పైగా అంతర్జాతీయ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కెనడాను విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. విదేశీ విద్యార్థుల కారణంగా ఎదురయ్యే సవాళ్లను క్రమపద్దతిలో కాకుండా కత్తి కట్టినట్లుగా ట్రూడో తీరు ఉందన్న విమర్శ వినిపిస్తోంది. లక్షలు ఖర్చు చేసి ఉన్నత విద్య కోసం వెళ్లే వారు కెనడా కాకుండా మరో దేశాన్ని ఎంపిక చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News