భారత్ కు బైబై.. 5 ఏళ్లలో అన్ని లక్షల మందా?

గడిచిన ఐదేళ్లలో (2018 -2023) భారతీయులు 114 దేశాల్లో పౌరసత్వాన్ని స్వీకరించటం గమనార్హం.

Update: 2024-08-21 04:22 GMT

ప్రపంచంలోని ఏ మారు మూల దేశానికి వెళ్లినా భారతీయులు దర్శనమిస్తారు. అది విద్యావకాశాలు కావొచ్చు.. ఉపాధి అవకాశాలు కావొచ్చు. ఏ దేశానికైనా వెళ్లే సత్తా.. అక్కడ బతుకునీడ్చేందుకు వెనుకాడని తత్త్వం భారతీయుల్లో భారీగా ఉంటుంది. అయితే.. గడిచిన కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయి..అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకోవటమే కాదు.. భారత పౌరసత్వాన్ని వదిలేసుకునే వారి సంఖ్య పెరుుతోంది. కారణాలు ఏమైనా.. గడిచిన ఐదేళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 8.34 లక్షల మంది. వీరంతా భారత పౌరసత్వాన్ని వదిలేసి విదేశీయులుగా మారిపోయారు.

కొవిడ్ కు ముందు పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య సగటున 1.32 లక్షల మంది ఉంటే.. కొవిడ్ తర్వాత ఆ సంఖ్యలో దాదాపు 20 శాతం పెరగటం గమనార్హం. మెరుగైన ఆర్థిక అవకాశాలు మాత్రమే కాదు ప్రశాంత జీవితం.. నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత పాస్ పోర్టుతో చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. అదే అమెరికా.. కెనడా.. యూకే.. ఆస్ట్రేలియా.. సింగపూర్ లాంటి దేశాల పాస్ పోర్టులతో ప్రపంచంలోని చాలా దేశాలకు వీసా తీసుకోకుండా ప్రయాణాలు చేసుకోవచ్చన్న భావనతోనూ భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి వెనుకాడటం లేదు.

గడిచిన ఐదేళ్లలో (2018 -2023) భారతీయులు 114 దేశాల్లో పౌరసత్వాన్ని స్వీకరించటం గమనార్హం. వీరిలో అత్యధికులు అమెరికా.. కెనడా.. ఆస్ట్రేలియా.. యూకే.. జర్మనీల్లో స్థిరపడుతున్నారు. సంపన్న దేశాల్లోనే కాదు.. చివుకు పాకిస్థాన్.. నేపాల్.. కెన్యా పౌరసత్వాన్ని స్వీకరించిన భారతీయులు కూడా ఉన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచంలో చైనా తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్న దేశం భారతే. వివిధ దేశాల్లో దాదాపు 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వీకరించటం ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరి ద్వంద్వ పౌరసత్వం లేదు. ఇలాంటి అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించలేదు. 2006 నుంచి ఓవర్ సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా పేరుతో కార్డును జారీ చేస్తున్నారు. జీవితకాల పరిమితితో జారీ చేసే ఈ కార్డుతో భారత్ కు వీసా లేకుండా వచ్చేయొచ్చు. అంతేకాదు.. భారత్ లో ఉంటూనే ప్రైవేటు జాబ్ చేసుకోవచ్చు. దీంతో.. భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి మనోళ్లు పెద్దగా ఆలోచించట్లేదు.

Tags:    

Similar News