యూఎస్‌ లో భారత్‌ కాన్సులేట్‌ పై దాడి.. ఎన్‌ఐఏ సంచలన ప్రకటన!

దాడికి సంబంధించి 10 మంది అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ వారి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

Update: 2023-09-22 05:23 GMT

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ పై ఈ ఏడాది మార్చిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)) సంచలన ప్రకటన చేసింది. దాడికి సంబంధించి 10 మంది అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ వారి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.


ఈ 10 మంది అరెస్టుకు సహకరించాలని ప్రజలను కోరింది. ఈ 10 అనుమానితుల గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మూడు వేర్వేరు ప్రకటనలను ఎన్‌ఐఏ జారీ చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన మొదటి ప్రకటనలో ఇద్దరు అనుమానితుల ఫొటోలను, రెండో ప్రకటనలో ఇద్దరు అనుమానితుల ఫొటోలను, మూడో ప్రకటనలో ఆరుగురు అనుమానితుల ఫొటోలను పోస్టు చేసింది.

తమకు సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్ల గుర్తింపును రహస్యంగా ఉంచుతామని ఎన్‌ఐఏ హామీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 19న భారత కాన్సులేట్‌ పై దాడి జరిగింది. ఖలిస్థానీ అనుకూల గ్రూపులు పెచ్చుమీరిపోయి భారత కాన్సులేట్‌ కు నిప్పుపెట్టడానికి ప్రయత్నించారు.

అదే రోజు, ఖలిస్తానీ మద్దతుదారులు భద్రతా నియమాలను ఉల్లంఘించారు. అంతేకాకుండా ఖలిస్తానీ జెండాలను ఎగురవేశారు. భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా భారత అధికారులపై దాడి చేశారు. తదనంతరం, మళ్లీ జూలై 2న అధికారులు లోపల ఉండగానే మరొక ఖలిస్తానీ వర్గం కాన్సులేట్‌ కు నిప్పు పెట్టడానికి ప్రయత్నించింది.

ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. జూన్‌ 16న భారతీయ శిక్షాస్మృతి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

తాజాగా భారత కాన్సులేట్‌ పై దాడికి సంబంధించి 10 మంది అనుమానితుల చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. వీరి గురించి ఎవరికయినా తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరింది. తమకు సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.

Tags:    

Similar News