కొత్త చట్టాలపై ఆందోళన ఎందుకు?

భారతదేశంలో జూలై 1 నుంచి కొత్తచట్టాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే

Update: 2024-07-02 11:32 GMT
కొత్త చట్టాలపై ఆందోళన ఎందుకు?
  • whatsapp icon

భారతదేశంలో జూలై 1 నుంచి కొత్తచట్టాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎన్).. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీ.ఎన్.ఎస్.ఎన్.).. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈ చట్టం) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (బీ.ఎస్.ఏ) అమలవుతున్నాయి.

అయితే ఈ కొత్తచట్టాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా వారు లేవనెత్తే సందేహాలు, అంశాలు అత్యంత సహేతుకమైనవనే కామెంట్లు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, న్యాయశాఖ మంత్రులూ ఈ విషయంలో కేంద్రానికి లేఖలు రాస్తున్న పరిస్థితి.

అవును... దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... జూన్ 30 వరకూ జరిగిన నేరాలకు సంబంధించి మాత్రం విచారణ, కోర్టులు పాత చట్టాల ప్రకారమే పనిచేస్తాయి. అంటే... ఏక కాలంలో రెండు రకాల చట్టాల ప్రకారం పని జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా కొత్త చట్టాలపై పలువురు నేతలు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక న్యాయ శాఖ మంత్రితో పాటు పలువురు న్యాయవాదులు ఈ కొత్తచట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై సుదీర్ఘమైన చర్చ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రాల నుంచి ఇచ్చిన సలహాలను కేంద్రం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో వారు లేవనెత్తిన అంశాలపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తుంది. ఆ ఆందోళనలకు కారణమైన అంశాలేమిటనేది ఇప్పుడు చూద్దాం...!

నిరాహార దీక్ష నేరం!:

కొత్త చట్టాలపై పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణాలనూ వివరిస్తున్నారు. ఇందులో భాగంగా... ఆత్మహత్యలను నేరంగా పరిగణించకుండా.. నిరాహార దీక్షను నేరంగా పరిగణించడం దురదృష్టం అని అంటున్నారు కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్.కే. పాటిల్! మహాత్మ గాంధీ నిరాహార దీక్ష చేసి సత్యాగ్రహం చేస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేస్తున్నారు!

చట్టాల్లో లింగ వివక్ష!:

దేశంలో అత్యాచారాలకు సంబంధించిన చట్టాలను లైంగిక వివక్ష లేకుండా రూపొందించాలనేది "లా కమిషన్" 2000వ సంవత్సరంలో చేసిన సిఫార్సు! ఇలా లా కమిషన్ నుంచి ఉన్న సిఫార్సును ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా... లైంగిక దోపిడీకి గురైన పురుషులకు సంబంధించి కొత్త చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవని కర్ణాటన నిపుణుల కమిటీ పేర్కొంది. తమ సూచనలు పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు!

సైబర్ నేరాలు ఎక్కడ?:

ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు, హ్యాకింగ్ వంటివి ఏ స్థాయిలో పెట్రేగిపోతున్నాయనేది తెలిసిన విషయమే. ఈ డిజిటల్ యుగంలో వీటి సమస్య పెనుశాపంగా మారుతుంది. అయితే... ఈ సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, పన్ను రహిత దేశాల్లో డబ్బులు దాచడం, డిజిటల్ నష్టం కలిగించడం వంటి నేరాలను కొత్తచట్టంలో చేర్చలేదని అంటున్నారు.

పోలీసులకు మరిన్ని అధికారాలు!:

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీ.ఎన్.ఎస్.ఎన్.)లో ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసి, ప్రాథమిక విచారణ జరిపేందుకు పోలీసులకు 14 రోజుల సమయం ఇచ్చారు. అయితే... లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయానికి ఇది పూర్తిగా విరుద్దం అని అంటున్నారు.

ఇదే సమయంలో కొత్త చట్టాల ప్రకారం... ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం హెడ్ కానిస్టేబుల్ కు ఇవ్వడంతో పాటు.. ఉగ్రవాదానికి పాల్పడినట్లు ఎవరిపై అయినా ఆరోపణలు చేయడం ఆందోళన కలిగించే అంశాలని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

అదేవిధంగా... ఒక నిందితుడికి కానీ నేరస్థుడికి కానీ ఇ-మెయిల్ పంపడం, అతడితో కలిసి టీ తాగడానికి వెళ్లడం వంటి చిన్న చిన్న కారణాలతో కూడా ఈ కొత్త చట్టాల ప్రకారం కేసు పెట్టవచ్చు! ఇదే క్రమంలో... ఎవరినైనా అదుపులోకి తీసుకుని 90 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకునే హక్కు పోలీసులకు ఉంటుంది!

స్టాలిన్ అభ్యంతరాలు ఇవే!:

కొత్త చట్టాల అమలుపై తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందని.. న్యాయ వ్యవస్థ, పోలీసులు, జైళ్లు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ వంటి భాగస్వాముల సామర్థ్యాలను.. ఇతర సాంకేతికతలను పెంపొందించడానికి తగిన వనరులు, సమయం అవసరం అని.. ఈ కొత్త చట్టాల అమలు విషయంలో తొందరపడి చేయకూడదని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.

ఇదే సమయంలో... విద్యా సంస్థలతోనూ చర్చలు జరపాలని.. దీనివల్ల న్యాయ విద్యా సంస్థల్లో సిలబస్ మారుతుందని తెలిపారు. ఇలా ఎన్నో విషయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... ఈ చట్టాల అమలు విషయంలో కేంద్రం తొందరపడిందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... కేవలం బ్రిటీష్ వాళ్లు నిర్మించారన్న కారణంతో... రైల్వే ట్రాక్ పక్కన మరో ట్రాక్ నిర్మించరు అని అంటున్నారు డీఎంకే నేత! ఈ కొత్త చట్టాల వల్ల న్యాయవాదులు ఎక్కువగా ప్రభావితమవుతారని ఆయన తెలిపారు. మరి.. ఇన్ని ఆందోళనలు, అభ్యంతరాల నడుమ కేంద్రం ఈ చట్టాలపై చర్చ చేపడుతుందా.. సందేహాలను నివృత్తి చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News