అమెరికాలో ఇండియన్ మెడికల్ స్టూడెంట్ దారుణ హత్య!
అగ్రరాజ్యంలో ఎప్పుడు ఏ మూల తుపాకీ శబ్ధాలు వినిపిస్తాయో.. ఆ తూటాలకు ఏ భారతీయుడు బలైపోతారో అనే ఆందోళనలు నిత్యం వెంటాడుతున్నాయి.
అమెరికాలో కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తుంది. అగ్రరాజ్యంలో ఎప్పుడు ఏ మూల తుపాకీ శబ్ధాలు వినిపిస్తాయో.. ఆ తూటాలకు ఏ భారతీయుడు బలైపోతారో అనే ఆందోళనలు నిత్యం వెంటాడుతున్నాయి. ఈ సమయంలో తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కాల్పుల్లో మృతి చెందాడు.
అవును... భారతదేశానికి చెందిన మెడికల్ విద్యార్థి అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. ఉత్తర భారతదేశానికి చెందిన ఆదిత్య అద్లాఖా అనే మెడికల్ విద్యార్థి.. కారులో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో... తీవ్రంగా గాయపడిన ఆదిత్యను ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మరణించాడు. ఈ సంఘటన నవంబర్ 9న జరుగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
ఈ మేరకు యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఆదిత్య మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆదిత్యపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ కారు అదుపుతప్పి ఒక గొడను ఢీకొట్టింది.
ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగిందని.. వాహనంలో బుల్లెట్ గాయాలతో ఉన్న వ్యక్తిని 911కు (అమెరికా అంబులెన్స్ నెంబర్) కాల్ చేసి కన్నింగ్ హాం కు తరలించినట్లు తెలిపారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో యూసీ మెడికల్ సెంటర్ కు తరలించారని అయితే అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించినట్లు తెలిపారు.
కాగా... ఆదిత్య అద్లాఖా వైద్య విద్యనభ్యసించడానికి ఇండియా నుంచి సిన్సినాటి యూనివర్సిటీకి వెళ్లాడు. 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ.. అనంతరం 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో... మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్.డీ కోసం అమెరికా వెళ్లాడు.