బంగారం.. వెండి ఎగుమతుల్లో ఎంత వ్యత్యాసం.. ఎందుకలా?
భారతీయులకు బంగారం మీద ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భారతీయులకు బంగారం మీద ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే వారిలో చైనీయులు.. ఆ తర్వాత భారతీయులే ఉంటారు. అలాంటి బంగారంలో అత్యధికంగా దిగుమతుల రూపంలోనే దేశానికి వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్ - జులై) బంగారం దిగుమతులు తగ్గుముఖం పడితే వెండి దిగుమతులు అందుకు భిన్నంగా పెరగటం కనిపిస్తుంది.
తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ - జులై కాలంలో రూ.1.05 లక్షల కోట్ల విలువైన బంగారం దిగుమతులు నమోదైనట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.1.32 లక్షల కోట్ల మేర బంగారం దిగుమతులు జరిగాయి. అంటే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.23 శాతం బంగారం దిగుమతులు తగ్గటం కనిపిస్తుంది. ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో ఒక్క జులైలోనే 10.65 శాతం తగ్గటం గమనార్హం.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి.. అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. పండుగల నేపథ్యం.. పెళ్లిళ్ల సీజన్ కావటంతో సెప్టెంబరులో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు దిగుమతి సుంకాన్ని సైతం కేంద్రప్రభుత్వం తగ్గించటంతో దిగుమతులు మరింత పెరగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మధ్యనే బంగారం.. వెండి కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తూ బడ్జెట్ లో పేర్కొనటం తెలిసిందే.
గత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్ 1 - 2024 మార్చి 31 మధ్య కాలం) మొత్తంలో బంగారం దిగుమతులు 30 శాతం పెరిగాయి. మన దేశానికి దిగుమతి అయ్యే బంగారంలో అత్యధికం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. మొత్తం దిగుమతుల్లో 40 శాతం స్విస్ నుంచి.. 16 శాతం యూఏఈ నుంచి.. 10 సౌతాఫ్రికా నుంచి దిగుమతి అవుతోంది. మన దిగుమతుల్లో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే బంగారం కేవలం 5 శాతం మాత్రమే.
బంగారం ముచ్చట ఇలా ఉంటే.. వెండి సీన్ మరోలా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల (రూ.54.35 వేల కోట్లు) దిగుమతులు అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వెండి దిగుమతులు ఈసారి ఎక్కువ అయ్యాయి. గత ఏడాదిలో ఇదే కాలంలో 215 మిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో వెండి దిగుమతులు భారీగా చోటు చేసుకున్నాయి.