లండన్ నది ఒడ్డున ఇండియన్ స్టూడెంట్ మృతదేహం... అసలేం జరిగింది

ఈ క్రమంలో తాజాగా 23 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహం లండన్ నది ఒడ్డున లభించింది!

Update: 2023-12-02 05:29 GMT

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. హత్యలు, రోడ్డు ప్రమాదాలు, మగ్గింగ్ ఎఫెక్టులు... కారణం ఏదైనా విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు పలువురు వరుసగా మృతిచెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా 23 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహం లండన్ నది ఒడ్డున లభించింది!

అవును... బ్రిటన్‌ లో నవంబర్‌ నెలలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మిత్ కుమార్ పటేల్ (23) కథ విషాదాంతమైంది. థేమ్స్ నది ఒడ్డున అతడి మృతదేహాన్ని గుర్తించారని తెలుస్తుంది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారని సమాచారం. దీంతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన మరో భారతీయ విద్యార్థి కథ అత్యంత విషాదంగా ముగిసినట్లయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... మిత్‌ కుమార్ పటేల్ ఉన్నత చదువుల కోసం సెప్టెంబరులో యూకే వెళ్లాడు. తూర్పు లండన్‌ లోని ప్లాయిస్టోలో బంధువుతో ఉంటున్నాడు. ఈ క్రమంలో షెఫీల్డ్ హాలం విశ్వవిద్యాలయంలో డిగ్రీ, అమెజాన్‌ లో పార్ట్‌ టైం ఉద్యోగం కోసం నవంబర్ 20న పటేల్ షెఫీల్డ్‌ కు వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలో నవంబర్ 17నుంచి కనిపించలేదు. దీంతో మరొసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో అతని బంధువులు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించడం ప్రారంభించారు. పోస్టర్లు, ఫ్లైయర్‌ లతో అతను తరచుగా తిరిగే ప్రాంతాలను కాన్వాసింగ్ చేయడం ప్రారంభించారని వార్తా నివేదిక తెలిపింది.

ఈ క్రమంలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు, పారామెడిక్స్, అగ్నిమాపక దళం కలెడోనియన్ వార్ఫ్ వద్ద నది ఒడ్డున ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు గుర్తించారు. నవంబర్ 21న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారని చెబుతున్నారు. అయితే ఈ మరణం అనుమానాస్పదంగా లేదని పోలీసులు ప్రకటించారు.

మిత్‌ కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు అతడి బంధువు వెల్లడించాడు. ఇందులో భాగంగా... "గో ఫండ్ మీ" ఆన్‌ లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని తెలిపాడు. దీంతో వారం వ్యవధిలో గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ 4,500కి పైగా వచ్చాయని తెలిపాడు.

Tags:    

Similar News