ప్రపంచంలో ఆత్మహత్యలలో మనమే టాప్ !
దేశలంలో ప్రస్తుతం లక్ష జనాభాకు 12.4 ఆత్మహత్యల రేటు నమోదు కావడం విచారించాల్సిన అంశం.
భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ప్రస్తుతం పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశలంలో ప్రస్తుతం లక్ష జనాభాకు 12.4 ఆత్మహత్యల రేటు నమోదు కావడం విచారించాల్సిన అంశం.
2018లో 1,34,516, 2019లో 1,39,123, 2020లో 1,53,052, 2021లో 1,64,033, 2022లో 1,70,921 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుండడం గమనార్హం. 2018 నుండి 2022 వరకు ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఏకంగా 27 శాతం పెరుగుదల సూచిస్తుండడం ప్రమాదక పరిణామం అని చెప్పాలి.
ఆత్మహత్యల అంశంపై సుప్రీం కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ అంశాలు ప్రధానంగా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో రోజుకూలీలు 26.4 శాతం, గృహిణులు 14.8 శాతం, స్వయం ఉపాధి పొందుతున్న వారు 11.4 శాతం, ఉద్యోగులు 9.6 శాతం, నిరుద్యోగులు 9.2 శాతం ఉంటున్నారు.