'ఇండియా.. దట్‌ ఈజ్‌ భారత్‌' గా ఎలా మారిందంటే!

ఈ నేపథ్యంలో 1935లో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ ను నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది.

Update: 2023-09-08 07:05 GMT

మనదేశానికి బ్రిటిషర్లు పెట్టిన ''ఇండియా'' అనే పేరును తొలగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందంటూ టాక్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. భారత రాజ్యాంగంలో 1వ అధికరణంలో 'ఇండియా.. దట్‌ ఈజ్‌ భారత్‌' అని పేర్కొనబడింది. అప్పట్లో ఇలా ఇండియా అని, భారత్‌ అని రెండు పేర్లు పెట్టడం వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తోంది. అప్పట్లో భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఇలా ఎందుకు రెండు పేర్లు పేర్కొనాల్సి వచ్చిందో నిపుణులు చెబుతున్నారు.

భారత రాజ్యాంగంలో 1వ ఆర్టికల్‌ లో 'ఇండియా.. దట్‌ ఈజ్‌ భారత్‌' అని రెండు పేర్లు పెట్టే ముందు నాటి భారత రాజ్యాంగ సభలో రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చ జరిగిందని అంటున్నారు. ఈ పేర్ల విషయంలో భారత్‌ అనే పేరుకు అనుకూలంగా కొందరు, ఇండియా అనే పేరుకు అనుకూలంగా మరికొందరు నిలవడంతో మధ్యేమార్గంగా రెండు పేర్లను పెట్టారని తెలుస్తోంది.

మన దేశ చారిత్రక వారసత్వానికి అనుగుణంగా భారత్‌ అని పేరు పెట్టాలని రాజ్యాంగ సభ సభ్యులు.. సేత్‌ గోవింద్‌ దాస్, హరి విష్ణు కామత్‌ పట్టుబట్టారు. ఇండియా అనే ఆంగ్లపదం.. వలసవాదానికి చిహ్నమని.. బ్రిటిషర్లు పెట్టిన పేరు మనకు ఎందుకని వారు వాదించారు. ఇండియా అని పేరు పెడితే పాశ్చాత్యుల ఆధిపత్యానికి గుర్తుగా ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే ఇంకో సభ్యుడు హరిగోవింద్‌ పంత్‌.. 'భారత్‌ వర్ష'గా దేశం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. మరికొందరు సభ్యులు చైనా యాత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ తన రచనల్లో దేశం పేరును భారత్‌ గా పేర్కొన్నారని.. కాబట్టి ఆ పేరు పెట్టాలని సూచించారు.

కాగా బ్రిటిషర్లు సింధు నదిని ఇండస్‌ అని పిలిచేవారు. ఇండస్‌ కు అవతల వైపును ఉండే భూభాగాన్ని ఇండియాగా పిలిచారు. ఇండస్‌ (సింధు నది) ఒడ్డున నివసించే ప్రజలు కాబట్టి మనను ఇండియన్లుగా పిలవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 1935లో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ ను నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే మనం నాటి చట్టంలోని అంశాలనే యథాతథంగా వాడుతుండటం గమనార్హం.

ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లో దేశ విభజన జరిగింది. ఇండియా, పాకిస్థాన్‌ లుగా దేశం విడిపోయింది. పాకిస్తాన్‌ లో ఉన్న హిందువులు భారత్‌ వైపు, ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్‌ వైపు వెళ్లే క్రమంలో హింస చోటు చేసుకుంది. భారీ ఎత్తున ప్రజలు మరణించారు.

ఈ ప్రభావం రాజ్యాంగ సభపై పడింది. భారత్‌ అనే పేరు కేవలం హిందూత్వాన్ని మాత్రమే సూచిస్తోందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలన్నా.. దేశంలో అన్ని మతాలు, సంస్కృతులు ఉండాలంటే ఇండియా అనే పేరు కూడా ఉండాలని రాజ్యాంగ సభ భావించింది. ఈ పేరుపైన ఓటింగ్‌ నిర్వహించారు. ఇండియా పేరుకు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 38 ఓట్లు వచ్చాయి.

దీంతో దేశానికి ఇండియా అనే పేరు పెట్టడానికి మార్గం సుగమమైంది. అలాగే దేశానికి ప్రాచీన కాలం నుంచి ఉన్న చరిత్ర, సంస్కృతుల నేపథ్యంలో 'ఇండియా.. దట్‌ ఈజ్‌ భారత్‌' అని రాజ్యాంగం 1వ ఆర్టికల్‌ లో చేర్చారు.

Tags:    

Similar News