భారత్ ఆల్టిమేటం.. దిగొచ్చిన కెనడా!
కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని.. ఆ దేశంలో భారతీయులపై ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని వెల్లడించింది.
తమ దేశంలో ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెద్ద కలకలం రేపారు. అంతేకాకుండా తమ దేశంలో భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా కెనడా మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు భారత్ పై ఫిర్యాదులు చేశారు. నిజ్జర్ హత్య వ్యవహారంపై తమ దర్యాప్తుకు భారత్ కూడా సహకరించాల్సిందిగా ఒత్తిడి తేవాలని ఆ దేశాలను కోరారు.
మరోవైపు కెనడా చర్యలపై అగ్గిమీద గుగ్గిలమైన భారత్.. మనదేశంలోని కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం వదిలిపొమ్మని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కెనడాకు వీసాల జారీని నిలిపేసింది. అంతేకాకుండా ఇప్పటికే కెనడాలో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని.. ఆ దేశంలో భారతీయులపై ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని వెల్లడించింది.
కెనడా విషయంలో సీరియస్ గా ఉన్న భారత్ తమ దేశంలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిలో 40 మందిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆల్టిమేటం జారీ చేసింది. భారత్ లో 62 మంది వరకు కెనడా దౌత్య సిబ్బంది ఉన్నారు. వీరిలో 40 మందిని వెనక్కి తీసుకోవాలని భారత్ పేర్కొంది. ఇందుకు అక్టోబర్ 10ని డెడ్ లైన్ గా విధించింది. వారందరికీ భద్రత తాము కల్పించలేమని, దౌత్యపరంగా ఇస్తున్న రక్షణ కూడా ఎత్తేస్తామని తెలిపింది.
ఒట్టావా (కెనడా రాజధాని)లోని భారత దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని భారత్ కోరుతోంది.
ఈ నేపథ్యంలో కెనడా దిగొచ్చింది. రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు కెనడా విదేశీ వ్యవహరాలమంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. ఇందుకు కెనడా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. కెనడియన్ దౌత్యవేత్తల భద్రతను తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, ఈ విషయంలో భారత్ తో ప్రైవేట్‌గా చర్చలు జరపాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
మరోవైపు భారత్ తో తాము వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. భారత్ తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా తమ బంధాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. భారతదేశంలోని కెనడియన్ కుటుంబాలకు సహాయం చేసేందుకు తాము అక్కడే ఉండాలని అనుకుంటున్నామని చెప్పారు.
అక్టోబర్ 10వ తేదీలోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన అనంతరం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుదనేది వేచిచూడాల్సిందే.