కాసుల కక్కుర్తి.. బీమా చేయించి మరీ బావను చంపించాడు
బావమరిది విస్లావత్ నరేశ్ నాయక్ తో కలిసి ఏడాది క్రితం జేసీబీని కొనుగోలు చేశారు. మూడునెలల క్రితం బావ పేరు మీద పోస్టల్ బీమా కూడా చేయించాడు.
‘బావమరిది బ్రతక గోరును.. దాయాది చావగోరును’ అన్న పాత కాలం సామెత గురించి తెలిసిందే. బావమరిది గొప్పతనాన్ని చెబుతూ.. బంధువులంతా ఒక దిక్కు.. బావమరిది ఇంకొక దిక్కు అంటూ గొప్పగా చెబుతుంటారు. ఈ పైసల ప్రపంచంలో ఈ బంధాలన్నీ ఉత్త ట్రాష్ గా మారాయా? అన్న అనుమానం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పైసల కోసం బావను చంపించాడో బావమరిది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం హైదరాబాద్ శివారులోని అమీన్ పూర్ లో చోటు చేసుకుంది.
బీమా పాలసీ చేయించి మరీ.. ఆ పైసలు కోసం చంపేసిన దారుణం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ హత్య గురించి షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. మెదక్ జిల్లాలోని సోమ్లాతండాకు చెందిన గోపాల్ నాయక్ పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అమీన్ పూర్ కు ఫ్యామిలీతో పాటు వచ్చాడు. కష్టపడుతూ కాస్తంత డబ్బుల్ని కూడబెట్టాడు.
బావమరిది విస్లావత్ నరేశ్ నాయక్ తో కలిసి ఏడాది క్రితం జేసీబీని కొనుగోలు చేశారు. మూడునెలల క్రితం బావ పేరు మీద పోస్టల్ బీమా కూడా చేయించాడు. బీమా ఉంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుందని మాయమాటలు చెప్పాడు. బావ మరణిస్తే.. బీమా డబ్బులతో పాటు.. జేసీబీ మీద ఉన్న వాయిదాలు కట్టకుండా తప్పించుకోవటంతో పాటు.. బీమా పైసలు కూడా సొంతమవుతాయని ప్లాన్ చేశాడు.
ఇందులో భాగంగా తన మేనమామ దేవీసింగ్ తో కలిసి ఈ నెల పద్నాలుగున రాత్రి వేళలో.. హత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేసి వస్తానంటూ ఇంట్లో నుంచి రాత్రి వేళ బయటకు వెళ్లిన గోపాల్ నాయక్ ఇంటికి తిరిగి రాలేదు. తర్వాతి రోజు అమీన్ పూర్ శివారులోని శ్మశాన వాటిక వద్ద చనిపోయి పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా లోతుగా విచారించిన క్రమంలో ఈ దారుణం బయటకు వచ్చింది. దీంతో.. బావమరిదిని అరెస్టు చేశారు.