రోజాతో ఆడేసుకుంటారా? ప్రభుత్వ వ్యూహం ఏంటి?
‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.;
‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. రూ.119 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజాకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ‘ఆడుదాం ఆంధ్ర’ ఆటల పోటీల్లో రోజాతోపాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి కమీషన్లు అందాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్లు శాసనమండలిలో మంత్రి రామప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు స్వతంత్ర కమిటీని వేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో క్రీడాభివృద్ధి కోసమని ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు వంద కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్లు మాజీ మంత్రి రోజాతోపాటు పలువురు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విచారణకు కమిటీ వేయడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రోజాపై అరోపణలు చేస్తూ విజయవాడకు చెందిన ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేశారు. రోజాతోపాటు అప్పటి ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ పైనా అనుమానాలు వ్యక్తం చేశాడు.
దీంతో రోజా అవినీతిపై ప్రభుత్వానికి అస్త్రం దొరికనట్లైందని అంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్న రోజాపై ప్రభుత్వం బ్రహ్మస్త్రం ప్రయోగించడానికి సిద్ధమవుతుందా? అనేది టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పోసాని జైలులో ఉండగా, డైరెక్టర్ ఆర్జీవీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బ్యాక్ గ్రౌండు ఉన్న రోజాపై విచారణకు ఆదేశించడం సంచలనం రేపుతోంది. దాదాపు 199 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో రూ.100 కోట్లు ఖర్చైందని ఆరోపణలు రావడం విశేషం. ఏదిఏమైనా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఏం తేలుస్తుందో చూడాల్సిందే..