ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చదవాలి
ఇదంతా ఎందుకంటే.. తాజాగా సెబీ ఒక కీలక అంశంపై అధ్యయనం చేసింది.
చేసే జాబ్ ఏదైనా.. ట్రేడింగ్ చేయటం ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టటం తప్పు కాదు కానీ.. పెట్టాల్సిన విధంగా పెట్టటం.. శాస్త్రీయంగా అడుగులు వేసే ధోరణి చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎవరో ఏదో కొనటంతో భారీగా లాభాలు వచ్చాయన్న మాటల్నే పట్టించుకుంటారు కానీ.. ఆ లాభాల వెనుక వారు పడిన శ్రమను మాత్రం గుర్తించరు. అంతేకాదు.. వారి లాభాల వెనకున్న వ్యూహాన్ని అర్థం చేసుకోరు. అందరూ చూసేది లాభాలే. నష్టాల గురించి తక్కువ మందే ఫోకస్ చేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే.. తాజాగా సెబీ ఒక కీలక అంశంపై అధ్యయనం చేసింది.
దీని ప్రకారం కొన్ని విధానాల్లో ట్రేడింగ్ చేసే వారు నష్టపోతున్న వైనం వెలుగు చూసింది. సెబీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైన కీలకాంశాల్ని చూస్తే.. ట్రేడింగ్ చేసే ప్రతి వారిలో అత్యధికులు చేసే తప్పులు అర్థమయ్యే వీలుంది. అంతేకాదు.. ట్రేడింగ్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అర్థమవుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన సర్వే ప్రకారం ఏయే అంశాలు వెలుగు చూశాయంటే..
- డెరివేటివ్స్ ట్రేడింగ్ లోనే కాదు ఈక్విటీ క్యాష్ విభాగంలో ఇంట్రాడే ట్రేడింగ్ లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు.
- ఇలా ట్రేడింగ్ చేసే ప్రతి పది మంది రిటైల్ మదుపరుల్లో ఏడుగురు నష్టపోతున్నారు.
- నష్టాలకు గురి అవుతున్నా ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ట్రేడింగ్ చేసేందుకు మదుపరులు వెనుకాడటం లేదు.
- 2018-19తో పోలిస్తే 2022-23లో ట్రేడింగ్ చేసే మదుపరుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
- మార్కెట్ లో మదుపు ద్వారా లాభాలు సంపాదించిన వారి కంటే నష్టపోయిన వారే ఎక్కువ. అంతేకాదు.. ఒకసారి నష్టపోయినా తమ లక్ ను పరీక్షించుకునేందుకు మళ్లీ మళ్లీ ఇంట్రా డే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ లోకి ప్రవేశిస్తున్నారు.
- ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ట్రేడింగ్ చేసే ముగ్గురిలో ఒకరు ఇంట్రా డే ఈక్విటీ ట్రేడింగ్ చేస్తున్నారు.
- ఈ తరహా ట్రేడింగ్ చేస్తున్న 48 శాతం మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయస్కులే ఉన్నారు. 2018-19లో వీరి పాత్ర 18 శాతం మాత్రమే.
- కొవిడ్ తర్వాత యువకులు పెద్ద సంఖ్యలో స్టాక్ మార్కెట్ ల్లోకి ప్రవేశిస్తున్నారు.
- టెక్నాలజీతో బాగా పరిచయం ఉన్న యువకులు ఎక్కువమంది ఇంట్రా డే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ సైతం చేస్తున్నారు.
- ఇలా ట్రేడింగ్ చేసే యువకుల్లో 76 శాతం మంది ఇంట్రా డే క్యాష్ ట్రేడింగ్ లోనూ నష్టపోతున్నారు.