ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. అనుమానం ఆ దేశంపైనేనా?
ఇప్పటి ఇరాన్ వేరు.. ఒకప్పటి ఇరాన్ వేరు.. 1970లకు ముందు ఆ దేశం యూరప్ దేశాల తరహాలో ఆధునికంగా ఉండేది.
ఇప్పటి ఇరాన్ వేరు.. ఒకప్పటి ఇరాన్ వేరు.. 1970లకు ముందు ఆ దేశం యూరప్ దేశాల తరహాలో ఆధునికంగా ఉండేది. ఆ దేశానికి రాజు ఉండేవాడు. 1979 మార్చిలో అయతుల్లా రుహోల్లా అలీ ఖొమేని ప్రవాసం నుంచి తిరిగొచ్చి.. ఇరాన్ లో రాజు షా పాలనను కూలదోశారు. ఆ తర్వాత "ఇస్లామిక్ రిపబ్లిక్, అవునా కాదా?" అనే ప్రశ్నతో ఇరాన్ అంతటా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ కే ప్రజలు ఓటు వేశారు. అలా ఇస్లామిక్ విప్లవం అనంతరం సంప్రదాయ దేశంగా మారిపోయింది. దీంతోనే ఇరాన్ కు సుప్రీం లీడర్ ఆవిర్భవించాడు. వారే ఆయతుల్లాలు. ఇరాన్ సుప్రీం లీడర్ గా ప్రస్తుతం అయతొల్లా అలీ ఖమేనీ ఉన్నారు. ఈయన దేశాధినేత. అధ్యక్షుడి కంటే ఈయన మాటే శాసనం. సాయుధ దళాలు, న్యాయ వ్యవస్థ , రాష్ట్ర రేడియో, టీవీ, గార్డియన్ కౌన్సిల్, ఎక్స్ పెడియెన్సీ డిస్సర్న్ మెంట్ కౌన్సిల్ వంటి ఇతర కీలక ప్రభుత్వ సంస్థలు సుప్రీం లీడర్ కు జవాబుదారీగా ఉంటాయి.
తొలి పదేళ్లు రుహెల్లా..
రుహోల్లా ఖొమేనీ 1989 వరకు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్నారు. ఆ తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ నియమితులయ్యారు. 85 ఏళ్ల ఖమేనీ వారసుడిగా గత మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ పేరు వినిపించింది. రైసీ దుర్మరణంతో ఖమేనీ వారసుడిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. కాగా, ఇరాన్ ప్రస్తుతం నేరుగా ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తోంది. శనివారం తెల్లవారుజామున వంద ఫైటర్ జెట్లు ఇరాన్ పై దాడికి దిగాయి. హిజ్బుల్లాలకు మద్దతుగా ఇరాన్ సాగిస్తున్న ఈ పోరాటం మున్ముందు ఎక్కడకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఖమేనీ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.
దాడులు చేయకుంటే దైవ ద్రోహమే
తమ అత్యున్నత సైనిక విభాగం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ) సైనికులను హతమార్చిన, తమ దేశ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన హమాస్ పొలిటికల్ చీఫ్ హనియేను కూడా చంపేసిన ఇజ్రాయెల్ పై దాడి చేయకుంటే అది దైవ ద్రోహమేనని గతంలో ఖమేనీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ పై దాడికి దిగాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
వయోభారమా..? కుట్ర కోణమా?
85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వయోభారంతో అనారోగ్యానికి గురయ్యారా? లేక ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? అనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. రైసీ దుర్మరణం తొలుత ప్రమాదమే అని భావించారు. అయితే, ఆయనను ‘పేజర్’ పేల్చి హతమార్చారనే ఊహాగానాలూ వచ్చాయి. దీని తర్వాత ఇరాన్ కు అతిథిగా వచ్చిన హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేనూ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా హతమార్చింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే ఇజ్రాయెల్ పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరి ఆయన వారసుడెవరు?
ఒకవేళ రైసీ జీవించి ఉంటే గనుక ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యేవారు. ఇప్పుడు ఖమేనీ లేకుంటే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరనేది ప్రశ్నగా మారింది. ఆయన రెండో కుమారుడు మెజ్తాబా (55) ఆ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇరాన్ ఈ నెల 1న ఇజ్రాయెల్ 200 క్షిపణులతో దాడులు చేసింది. దానికి ప్రతీకారంగా శనివారం ఇజ్రాయెల్ స్పందించింది. దీనిపై తదుపరి ఏం చేయాలనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఖమేనీ అనారోగ్యంపై ఊహాగానాలు వస్తున్నాయి.