జగన్ ఇంచార్జిల విషయంలో మళ్లీ తప్పు చేస్తున్నారా ?
సాధారణంగా ఓటమి చెప్పే పాఠాలు జాగ్రత్తగా విశ్లేషించుకుని భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ప్రతీ పార్టీ అడుగులు వేస్తుంది.
వైసీపీ అధినేత జగన్ పార్టీని పునర్ నిర్మించే క్రమంలో ఉన్నారు. అయితే జగన్ ఈ విషయంలో అనుసరిస్తున్న తీరు పట్ల మాత్రం చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా వైసీపీ ఓటమి పాలు అయింది. సాధారణంగా ఓటమి చెప్పే పాఠాలు జాగ్రత్తగా విశ్లేషించుకుని భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ప్రతీ పార్టీ అడుగులు వేస్తుంది.
వైసీపీ కూడా ఫలితాల మీద సమీక్ష చేసింది. ఎందుకు ఈ తరహా ఫలితాలు వచ్చాయన్న దాని మీద పార్టీలో అంతర్మధనం సాగింది. అయితే దాని తరువాత పార్టీ నిర్మాణం మళ్లీ ఎలా చేయాలన్నది అధినాయకత్వం అన్నీ ఆలోచించుకుని అడుగులు వేస్తుంది అనుకుంటే మాత్రం అలా కాకుండా మళ్లీ గతంలో చేసిన తప్పులనే చేస్తూ పోతోందా అన్న చర్చ అయితే పార్టీలో సాగుతోంది.
ఇక చూస్తే పార్టీ నుంచి చాలా మంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. వారంతా కూడా పార్టీకి గట్టి నేతలుగా ఉన్నారు. వైసీపీ ఘోర ఓటమి తరువాత వారు పునరాలోచనలో పడి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే అలా వెళ్లిపోయిన వారి ప్లేస్ లో జగన్ బలమైన నాయకులను తెచ్చి పెడితేనే పార్టీకి అక్కడ న్యాయం జరుగుతుంది. కానీ జగన్ మాత్రం డమ్మీ నేతలను అక్కడ పెట్టి ఏదో పార్టీని నడపాలని నడుపుతున్నట్లుగా ఉందని అంటున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీకి ఇదే రకంగా ఘోరమైన పరాజయం ఎదురైనపుడు పార్టీ క్యాడర్ ని ముందు పెట్టి చంద్రబాబు టీడీపీని యాక్టివ్ చేస్తూ ముందుకు సాగిపోయారు అని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ ఆయా నియోజకవర్గాలలో క్యాడర్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని నియమిస్తే ఎలా అన్నది వైసీపీలో ఒక చర్చగా సాగుతోంది. ప్రస్తుతానికి కొంత సైలెంట్ గా ఉన్నా ఎన్నికల సమయానికి బలమైన నేతలనే ఇంచార్జిలుగా పెడితేనే పార్టీకి ఊపు గెలుపు హుషార్ వస్తుందని అంటున్నారు.
అలా కాకుండా డమ్మీ నేతలను పెడితే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే జగన్ కి రాజకీయంగా అనుభవం లేదు కాబట్టి హెలికాప్టర్ నుంచి డ్రాప్ చేసినట్లుగా నేతలను పై నుంచి దిగుమతి చేస్తున్నారు అని అంటున్నారు. అంటే అధినాయకత్వమే నిర్ణయం ఒకటి తీసుకుని నాయకులను డంప్ చేస్తోంది అని అంటున్నారు.
దీని వల్ల లీడర్ కి క్యాడర్ కి మధ్య గ్యాప్ అలాగే ఉండి పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ఈ విధంగా తన కోటరిలో కొందరు రాజకీయ సలహదారులను పెట్టుకుని పార్టీని నడుపుతున్నారు అని అంటున్నారు. నిజానికి ప్రతిపక్షంలో పార్టీ ఉన్నపుడు అసలైన దూకుడు ఉండాలి. జనాలకు ఎప్పటికపుడు రీచ్ అయ్యేలా పార్టీ ఉండాలి.
ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా గట్టిగా స్పందించేలా ఉండాలి. కానీ జగన్ చేస్తున్నది వేరుగా ఉంది అని అంటున్నారు. ఆయన ఇంచార్జిలను వేస్తున్నామా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. వేసిన వారు ఎంతవరకూ పార్టీకి పనికి వస్తారు అన్నది ఆయన ఆలోచించి చేయాల్సి ఉందని అంటున్నారు.
పార్టీ అంటే జగన్ ఒక్కరే కారని, ఆయన ఇమేజ్ మాత్రమే సరిపోదని 2024 ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు. అయితే ఆ అనుభవాలను గుణపాఠాలుగా చూడకుండా ప్రజలు చంద్రబాబుని కేవలం ఆయన మభ్యపెట్టిన హామీలను చూసి మాత్రమే ఎన్నుకున్నారని ఎపుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని అతి విశ్వాసంతో కూడిన భ్రమలతో పోతే మాత్రం ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
పార్టీకి ఇపుడు ధీటైన నాయకులు కావాలని అంటున్నారు. కాస్తా ఆలస్యం అయినా ఆచీ తూచీ క్యాడర్ మెచ్చేలా జనంతో మమేకం అయ్యేలా నేతలను నియమిస్తే ఫ్యాన్ జోరు అందుకుంటుందని అంటున్నారు. కానీ వైసీపీలో జగన్ కి సలహాలు ఇస్తున్న వారు కూడా సరైన దిశగా పార్టీని నడిపించేలా ఇవ్వడం లేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే మాత్రం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వేస్తున్న స్టెప్స్ అన్నీ కలసి పార్టీని ఇబ్బందులలో పెడతాయా అన్నదే ఒక చర్చగా ఉంది అని అంటున్నారు.