కవిత అరెస్టు వ్యూహాన్నే కేటీఆర్ ఇష్యూలో అమలు చేస్తున్నారా?
తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇష్యూలోనూ కవిత విషయంలో అనుసరించిన పద్దతినే ఫాలో అవుతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
పాత కాలం నాటి చిట్టి కథ ఒకటుంది. ఒక కుక్కను చంపాలంటే.. మొదట దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. అది నిజమని నమ్మించాలి. ఆ తర్వాత దాన్ని మనం చంపక్కర్లేదు. అందరూ కలిసి చంపేస్తారు. ఇప్పటి రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. రాజకీయ శత్రుత్వం ఎంత ఉన్నప్పటికి ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అదే.. కాస్త వెయిట్ చేసి.. సరైన అంశాన్ని టేకప్ చేస్తే.. రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టొచ్చు. అంత చేసినప్పటికి ప్రజల నుంచి వ్యతిరేకత కూడా రాదు.
గులాబీ బాస్ కేసీఆర్ ను ఇరుకున పడేసేందుకు.. ఆయన మనో స్థైర్యాన్ని దెబ్బ తీయటానికి.. ఆయన కుమార్తె కవిత చేసిన తప్పుతో సాధ్యమైందని చెబుతారు. కవితను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తుంటారు. కవిత మీద ఆరోపణలు చేసినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పాత్ర నిజంగానే ఉందా? లేదా? అన్నది న్యాయ వ్యవస్థ తేల్చటానికి మరో పదేళ్లు పట్టొచ్చు.కానీ.. ఇప్పటికైతే జరగాల్సిన డ్యామేజ్ జరిగి పోయింది. అన్నింటికి మించి తెలంగాణ బాపు గారాలపట్టిని జైల్లో వేసినప్పటికి.. తెలంగాణ సమాజంలో ఈ అంశం ఎలాంటి భావోద్వేగాన్ని రగలకపోవటమే కేసీఆర్ కు ఎదురైన అతి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తారు.
నిజానికి కవిత అరెస్టు ఎపిసోడ్ ను చూస్తే.. ఒక క్రమపద్దతిని ఫాలో కావటం కనిపిస్తుంది. వాయిదాల పద్దతి మాదిరి..కవిత మీద కేసును బిల్డ్ చేయటం..ఆమె తప్పు చేసిందేమో అన్న సందేహానికి గురయ్యేలా చేయటం.. ఏదో జరిగి ఉండకపోతే ఇంత వరకు విషయం ఎందుకు వస్తుందన్న భావన కలిగించటం.. చివరకు కవిత అరెస్టు వేళకు.. ప్రజల్లోనూ ఎలాంటి సానుభూతి లేకుండా చేసిన వైనం అందరిని ఆకర్షించింది.
తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇష్యూలోనూ కవిత విషయంలో అనుసరించిన పద్దతినే ఫాలో అవుతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ లో సమ్ థింగ్.. సమ్ థింగ్ జరిగిందన్న భావన ప్రజల్లో అంతకంతకు ఎక్కువ అవుతోంది. కేటీఆర్ అరెస్టు అన్నంతనే.. ఉలిక్కిపడే స్థాయి నుంచి.. ఆయన రేపో మాపో అరెస్టు అవుతారన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకునేలా పరిస్థితులు చోటు చేసుకోవటం.. ఆయనపై వచ్చిన ఆరోపణలు..దానికి ఖండనలు.. ఆ తర్వాత వాటికి కౌంటర్లు ఇలా సాగిపోయి.. మొత్తంగా ఫార్ములా ఈ రేసింగ్ లో ఏదో జరిగిందన్న విషయాన్ని ప్రజలు నమ్మే వరకు ఇప్పుడు విషయం వెళ్లింది.
ఇలాంటి వాతావరణంలో కేటీఆర్ అరెస్టు జరిగినా.. ఇదేదో రాజకీయ ప్రతీకారంగా ప్రజలు భావించరు. అదే సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదన్న విషయాన్నిచెప్పుకునే క్రమంలో కేటీఆర్ ప్రదర్శించిన దూకుడు ఆయనకు నష్టం చేసేలా మారిందని చెప్పాలి. ఎందుకంటే.. తనపై పడిన మచ్చను కడుక్కునేందుకు కేటీఆర్ అనుసరించిన విధానం సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనపై చేస్తున్న ఆరోపణలకు అందరూ నమ్మే సాక్ష్యాల్ని.. ఆధారాల్ని చూపే కన్నా నోటికి పని చెప్పిన కేటీఆర్ తీరు ఆయనకు నష్టం వాటిల్లేలా చేసిందంటున్నారు.
ఒకవేళ కేటీఆర్ అరెస్టు కానీ జరిగితే.. గులాబీ పార్టీ అనుకుంటున్నట్లుగా ప్రజల్లో సానుభూతి భారీగా వస్తుందన్నఅంచనాల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. ఇప్పటివరకు చోటు చేసుకున్న అన్ని పరిణామాలు కవిత లిక్కర్ స్కాం వేళలో ఎలా జరిగాయో.. ఇప్పుడు అలానే జరుగుతున్నాయంటున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఎంతో కాలమే డిసైడ్ చేయాలి.