భారత్ లో 6జీ నెట్ వర్క్ ఎప్పటి నుంచంటే ?
ఈ క్రమంలో... ఇతర దేశాలకంటే ముందుగా 6జీ నెట్ వర్క్ ను తేవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే 5జీ స్మార్ట్ ఫోన్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో... ఇతర దేశాలకంటే ముందుగా 6జీ నెట్ వర్క్ ను తేవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యంలో ఐఐటీ మద్రాస్ పాత్ర అత్యంత కీలకం కాబోతుంది.
అవును... ఇతరదేశాలన్నింటికంటే ముందుగా మైక్రో సెకనులో ఒక టెరాబైట్ వేగంతో 6జీ సేవలను అందుబాటులోకి తేవాలని.. 2025లో తొలివిడతగా కొన్ని కీలక మలురాళ్లను అధిగమించాలని లక్ష్యాలు పెట్టుకుంది భారత్. అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే... ప్రపంచంలోనే 6జీ నెట్ వర్క్ తెచ్చిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉంది.
భారత్ లో 2030లోగా 6జీ సాంకేతికతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గతేడాది మర్చి 23న ప్రధాని నరేంద్రమోడీ.. "భారత్ 6జీ విజన్"ను విడుదల చేశారు. 5జీ స్పీడ్ కంటే 1000 రెట్లు వేగంగా ఈ 6జీ రాబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక మైక్రోసెకన్ లోనే ఒక టెరాబట్ వేగాన్ని అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ మేరకు చెన్నైలోని ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ లో 6జీ సాంకేతికత వృద్ధిపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేసేందుకు "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ను కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా... ఈ పరిశోధనల్లో కీలకంగా పాటించాల్సిన విధివిధానాలను ఇంటర్నేషనల్ టెలీకమ్యునికేషన్ యూనియన్ (ఐటీయూ) గత ఏడాది జూన్ లో విడుదల చేసింది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ టెలీకమ్యునికేషన్ మినిస్ట్రీ 470 ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కేంద్ర టెలీకమ్యునికేషన్ శాఖే పర్యవేక్షిస్తోంది. ఈ మధ్యే ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవానికి వచ్చిన ఆ శాఖ కార్యదర్శి నీరజ్ మితల్... ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించి, పరిశోధకులతో మాట్లాడి కార్యచరణపై సమీక్షించారు.
ఇదే సమయంలో... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారిన నేపథ్యంలో... దీన్ని దృష్టిలో ఉంచుకుని 6జీ నెట్ వర్క్ లోనూ అనువైన సాంకేతికతను తీసుకొచ్చేలా పరిశోధనలు జరగనున్నట్లు అధికారుల్లు అంటున్నారు! కొన్ని అప్లికేషన్లు ఈ కోణంలోనూ డిజైన్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు!