పదో తరగతి ఫెయిల్.. అయినా పట్టుబట్టి సివిల్స్ కొట్టి.. ఐఎఫ్ ఎస్ అధికారిణి కథ ఇదీ!
సాధారణంగా.. పదో తరగతి వరకు 70 శాతం మంది విద్యార్థులు చదువును కొనసాగిస్తారు. అక్కడ సక్సెస్ అయితే.. ఇక ముందుకు అడుగులు వేస్తారు.
సాధారణంగా.. పదో తరగతి వరకు 70 శాతం మంది విద్యార్థులు చదువును కొనసాగిస్తారు. అక్కడ సక్సెస్ అయితే.. ఇక ముందుకు అడుగులు వేస్తారు. ఏమాత్రంతేడా కొట్టి పది తప్పినా.. ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తారు. అప్పటికీ సక్సెస్ కాలేక పోతే.. ఇక, అంతటితో సరి! వేరే పని చూసుకుంటారు. ఇది సహజంగా జరిగే పని. దీని వల్ల జీవితంలో ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంటుంది.
అయితే.. పదో తరగతి ఫెయిల్ అయినంత మాత్రాన చదువును అక్కడితో ఆపేయాల్సిన పనిలేదని.. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉందని.. అనుకుంటే.. ఎన్ని వైఫల్యాలనైనా జయించి.. ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇషిత. ప్రస్తుతం ఆమె.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిణిగా ఉన్నారు. అయితే.. ఇదేమంత తేలికగా ఆమెకు రాలేదు. అనేక వైఫల్యాలు ఎదురైనా.. ఎదురీది ముందుకు సాగారు.
కానీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌కు చెందిన ఇషిత పదోతరగతి ఫెయిల్ అయ్యింది. ఇక చదువు అటకెక్కినట్టే అనుకున్నారంతా. కానీ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేసి పట్టుదలగా చదివింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో డిగ్రీ చేశారు. ఢిల్లీలోని ఓ స్కూల్‌లో ఉద్యోగంలో చేరింది. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో... యూపీఎస్‌సీ పోటీ పరీక్షను మూడుసార్లు రాసినా ఫలితం దక్కలేదు.
మరోపక్క ఆర్‌బీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటివి ప్రయత్నించి అక్కడా వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. నిరాశకు గురైనా, తిరిగి కోలుకొని మరింత పట్టుదలతో ప్రయత్నించింది. ఈ క్రమంలోనే చివరగా 2021లో యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పాసైన ఆమె ఛాలెంజ్‌గా తీసుకుని చదివి ఐఎఫ్ ఎస్‌కు ఎంపికైంది. ‘జీవితం చాలా చిన్నది. ఇందులో మనకు మనమే స్ఫూర్తికావాలి. వైఫల్యాలను పాఠాలుగా తీసుకొంటే మనలో దాగున్న శక్తి బయటకొస్తుంది. నిరాశకు గురైతే జీవితం అక్కడే ఆగిపోతుంది`` అని ఇషిత నేటి యువతకు స్ఫూర్తి మంత్రం చెబుతున్నారు.