కాంగ్రెస్ కు 45 సీట్ల ‘దక్షిణ’.. సాధ్యమేనా?
అయితే, ఎంతటి వైరుధ్యం ఉన్నప్పటికీ ప్రజల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ దేశ సమగ్రత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ ఉండదు.
భాతర దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలు పరస్పరం భిన్నం అనే సంగతి తెలిసిందే. ఉత్తర భారతంలోని రాజకీయాలపై జాతీయ పార్టీల ప్రభావం అధికం. దక్షిణాదికి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీల హవా సాగుతుంటుంది. అయితే, ఎంతటి వైరుధ్యం ఉన్నప్పటికీ ప్రజల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ దేశ సమగ్రత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ ఉండదు. ఇక ఎన్నికల విషయానికి వస్తే బీజేపీ దక్షిణాదిన పూర్తి స్థాయిలో బలంగా లేదనే చెప్పాలి. దీంతో పోలిస్తే కాంగ్రెస్ కాస్త నయం. ఆ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉంది. బీజేపీకి కర్ణాటకలో మాత్రమే పట్టుంది. ఏపీ, తమిళనాడుల్లో ఈ రెండూ నామమాత్రమే. కేరళలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమే అయినా.. జాతీయ మిత్రపక్షం సీపీఎంతో తలపడాల్సిన భిన్న పరిస్థితి. కేరళలో బీజేపీ మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా చొచ్చుకెళ్లలేకపోతోంది.
దక్షిణాదిన దమ్ము చూపితేనే
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉత్తరాదిన పెద్దగా సీట్లు వస్తాయని ఆశించలేం. ఎందుకంటే.. కేవలం హిమాచల్ ప్రదేశ్ తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు కాబట్టి. మోదీ పాలనపై వ్యతిరేకతతో ఓట్లేస్తే తప్ప.. మెజారిటీ సీట్లు గెలుస్తుందని భావించలేం. అంటే ఇక ఆశలన్నీ దక్షిణాది పైనే. కాగా, తెలంగాణలో 17, ఏపీలో 25, తమిళనాడులో 39, కర్ణాటకలో 28, కేరళలో 20 లోక్ సభ స్థానాలున్నాయి. పుదుచ్చేరితో కలుపుకొంటే మొత్తం 130 సీట్లు అవుతున్నాయి. ఏపీలో ఎలాగూ ఆశలు లేవు. అంటే.. మిగిలింది 105 మాత్రమే. వీటిలో 45 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తులో 12 సీట్లు నెగ్గాలని చూస్తోంది. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం. కేరళలో అధికార సీపీఎంపై వ్యతిరేకత ఉన్నా.. ఆ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి. ఇదో చిత్రమైన పరిస్థితి. కేరళలో ఎలా ముందుకెళ్తోందో చూడాలి.
తెలంగాణనే కీలకం
కాంగ్రెస్ దక్షిణాదిన 45 సీట్లు గెలవాలని చూస్తుండగా.. ఇందులో తెలంగాణదే 33 శాతం వాటా అయి ఉండాలి. అంటే కనీసం 15 స్థానాలు తెలంగాణ నుంచి నెగాలి. ఎందుకంటే.. కర్ణాటకలో ఉన్నంత బలంగా తెలంగాణలో ప్రతిపక్షాలు బలంగా లేవు. కర్ణాటకలో బీజేపీ ప్రభావం ఎక్కువ. 28 సీట్లుండగా కాంగ్రెస్ ఎంత గట్టిగా ప్రయత్నించినా 15 రావడం కష్టమే. ఏపీలో శూన్యమే. కేరళలో ఎలా ముందుకెళ్తారనేది చెప్పలేం. చివరకు చూస్తే తెలంగాణనే నికరం అనుకోవాలి.