కోటల్ని కూల్చే కోటరీలు: బాబు చేసిన తప్పే జగన్ చేశారా?
ఐదేళ్ల క్రితం 151 సీట్లను ఇచ్చిన ఓటర్లు తాజా ఎన్నికల్లో 11 సీట్లను ఇవ్వటం చూస్తే.. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.
అధికారంలో ఉన్న వారికి మాత్రమే కాదు.. ప్రముఖులకు.. సమాజంలో కీలక స్థానాల్లో ఉన్న వారికి ఆటోమేటిక్ గా ఉండేది కోటరీ. ఇందులో ఉండేవారు.. వారి మైండ్ సెట్.. వారి కమిట్ మెంట్.. నిజాయితీ లాంటివి సదరు ప్రముఖుడిని పేరు ప్రఖ్యాతులతో ముంచెత్తే పరిస్థితి ఉంటుందా? పాతాళానికి తీసుకెళ్లేలా చేస్తుందా? అన్నది డిసైడ్ అయ్యే పరిస్థితి. ఏపీ ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాన్ని గడిచిన ఐదేళ్లలో ప్రదర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావటం తెలిసిందే.
ఐదేళ్ల క్రితం 151 సీట్లను ఇచ్చిన ఓటర్లు తాజా ఎన్నికల్లో 11 సీట్లను ఇవ్వటం చూస్తే.. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాలనా సంస్కరణలు.. సంక్షేమ పథకాలు కొన్నింటికి ఆయన తర్వాత అధికారాన్ని చేపట్టే తెలుగుదేశం సైతం ఫాలోకాక తప్పదు. అయినప్పటికీ ఆయన ఇంత ఘోరమైన పరాజయాన్ని ఎందుకు పొందారు? అన్న ప్రశ్న వేస్తే.. టక్కున వచ్చే సమాధానం ‘కోటరీ’ అని. జగన్మోహన్ రెడ్డి మనసా వాచా కర్మణ నమ్మిన ఇద్దరంటే ఇద్దరిలో ఒకరు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే.. మరొకరు ధనుంజయ్ రెడ్డి. వీరిద్దరికి మాత్రం రోజువారీగా జగన్ టచ్ లో ఉండేవారు.
ఆయన ఏం చేయాలనుకున్నా.. వీరిద్దరితోనే మిగిలిన వారికి కమాండ్స్ వెళుతూ ఉండేవి. అంతటి గురుతర స్థానంలో ఉన్న ఆ ఇద్దరు తమకున్న పరిమితమైన ఆలోచనలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెబుతారు. ఎన్నికల పలితాలు వెల్లడైన తర్వాత వైసీపీకి చెందిన పలువురు నేతలు ఈ ఇద్దరిని దారుణంగా తప్పు పట్టిన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే ఒకరు మీడియా ముందుకు వచ్చి ధనుంజయ్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఆయన తీరుతోనే ఇలాంటి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా మండిపడ్డారు.
అయితే.. ఇక్కడే మరో వాదన ఉంది. సజ్జల.. ధనుంజయ్ లు ఇద్దరు ఇంత దారుణంగా వ్యవహరించి ఉంటే.. అదే విషయాన్ని జగన్ కు కంప్లైంట్ చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంత ధైర్యమే ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదన్న మాట వినిపిస్తోంది. జగన్ పూర్తిగా నమ్మే ఇద్దరి మీద వారి తప్పులు.. వాటి కారణంగా ప్రభుత్వానికి.. పార్టీకి జరిగే నష్టాల్ని వివరించి ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు చెప్పినంత తేలిగ్గా.. చేతిలో అధికారంలో ఉన్నప్పుడు చేయటమన్నది మర్చిపోకూడదు.
ఇందుకు 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోజుల్ని చూస్తే విషయం అర్థమవుతుంది. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని పాలించేది పేరుకు చంద్రబాబు అయినప్పటికీ అప్పట్లో ఆయన చుట్టూ ఉన్న కోటరీనే వ్యవహారాల్ని నడిపించేది. నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటోళ్లు చుట్టూ ఉండేవారు. బాబు తరఫు వారు చాలానే నిర్ణయాలు తీసుకునే వారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను బాబు వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నట్లుగా చెప్పే వారు. కానీ.. చివరకుజరిగిందేంటి? 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అప్పటి వరకు కోటరీగా ఉన్న పెద్ద మనసులు అద్రశ్యమయ్యారు.
విపక్ష నేతగా చంద్రబాబు ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో పోరాడాల్సి వచ్చింది. తీవ్ర అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వయసు మీద పడుతున్నా.. పట్టుదలతో.. పంతంతో పోరాడిన ఆయన చివరకు అనుకున్నది సాధించారు. చంద్రబాబు కావొచ్చు.. జగన్మోహన్ రెడ్డి కావొచ్చు. తాము అధికారంలో ఉన్నప్పుడు దగ్గరికి తీసే కోటరీతోనే అసలు ముప్పంతా అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజానికి కోటరీతో కోటలు నిర్మించొచ్చని చెబుతారు కానీ కోటరీతోనే కోటలు కూలిపోతాయన్న విషయం ఏపీ రాజకీయాల్ని చూస్తే అర్థమవుతుంది. ఈసారి అధికారంలోకి రానున్న చంద్రబాబు తన కోటరీ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరం. ఎందుకంటే.. కోటరీ బాధితుడిగా ఉన్న ఆయనకు తత్త్వం బోధ పడిందా? అన్నది రానున్న రోజులు స్పష్టం చేయనున్నాయి.