నిజమా? ఆ పార్టీ ఎంపీలుగా పదిమంది కొత్తవారిని దింపనుందా?

2019లో మార్చి 10న నోటిఫికేషన్ రాగా.. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు జరిగాయి.

Update: 2024-01-26 11:43 GMT

లోక్ సభ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. కేవలం రెండు నెలల లోపులోనే నోటిఫికేషన్ వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. 2019లో మార్చి 10న నోటిఫికేషన్ రాగా.. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు జరిగాయి. ఈసారి అంతకంటేముందే ప్రక్రియ మొదలవుతుందని కథనాలు వస్తున్నాయి. వీటిలో నిజం ఎంతో తేలాల్సి ఉండగా.. రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలకు అంతా సిద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రంలో ప్రధాని మోదీ మూడోసారీ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండగా, దేశ ప్రయోజనాల రీత్యా ఆయనను కిందకు దించుతామని ప్రతిపక్ష ఇండియా కూటమి అంటోంది. అయితే, రాష్ట్రాల వారీగా చూస్తే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా ఉండాలి.

సీన్ మారిన తెలంగాణ..

డిసెంబరు 3న వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అన్నిటికంటే ఆశ్చర్యంగా నిలిచింది తెలంగాణ. అత్యంత బలంగా కనిపించిన బీఆర్ఎస్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తమ పోరాటంతో కిందకు దించింది. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో వ్యూహాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకెళ్లి విజయాన్ని సాధించింది. కాగా, గెలుపుపై గట్టి నమ్మకం పెట్టుకున్న బీఆర్ఎస్ ఓటమితో నిరాశ చెందింది. ఈ క్రమంలో వెంటనే లోక్ సభ ఎన్నికలకు సన్నాహక సమావేశాల నిర్వహణ చేపట్టింది.

సమీక్ష ముగిసింది..

జనవరి 3 నుంచి బీఆర్ఎస్ చేపట్టిన లోక్ సభ నియోజకవర్గాల సమీక్ష ఇటీవల ముగిసింది. ఇందులోభాగంగా కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పారు. వారితో నాయకత్వం కూడా ఏకీభవించింది. మరోవైపు బీఆర్ఎస్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది? అనేది చర్చనీయాశంగా ఉంది. ఏకంగా పదిమంది కొత్త అభ్యర్థులను బరిలో దింపుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు గాను హైదరాబాద్ ను పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే.. 16 స్థానాల్లో పది మంది కొత్తవారికే టికెట్ ఇవ్వనున్నట్లు. ఇప్పటికే నిజామాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను బరిలో దింపడం లేదని చెబుతున్నారు. చేవెళ్లలో సిటింగ్ ఎంపి రంజిత్ రెడ్డి, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ లకు టికెట్లు ఖరారు చేశారని అంటున్నారు. ఇక కొత్త ముఖాలు.. అది కూడా అధికారంలో లేని సమయంలో ఎవరైతారా? అనేది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News